నష్టాల్లో ప్రారంభమై.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

నష్టాల్లో ప్రారంభమై.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

ముంబై: సెన్సెక్స్, నిఫ్టీలు శుక్రవారం సెషన్‌‌‌‌లో ఇంట్రాడేలో నష్టాల నుంచి రికవర్ అవ్వగలిగాయి. ఒకానొక దశలో 400 పాయింట్లు వరకు పడిన సెన్సెక్స్‌‌, చివరికి12.27 పాయింట్లు తగ్గి 61,223 పాయింట్లు దగ్గర ముగిసింది. నిఫ్టీ 2.05 పాయింట్లు పడి 18,256 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్‌‌లో ఏసియన్ పెయింట్స్‌‌, యాక్సిస్ బ్యాంక్‌‌, హిందుస్తాన్ యూనిలీవర్‌‌‌‌, ఎం అండ్ ఎం, విప్రో, హెచ్‌‌డీఎఫ్‌‌సీ, భారతీ ఎయిర్‌‌‌‌టెల్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మరోవైపు టీసీఎస్‌‌, ఇన్ఫోసిస్‌‌, ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌‌లోని 18 షేర్లు నష్టాల్లో క్లోజవ్వగా, 12 షేర్లు లాభపడ్డాయి. ‘గ్లోబల్‌‌ మార్కెట్లు నెగెటివ్‌‌లో ట్రేడవ్వడంతో దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. ఐటీ, రియల్టీ, హెల్త్‌‌కేర్‌‌‌‌ షేర్లు పెరగడంతో చివరికి నష్టాలను తగ్గించుకొని ఫ్లాట్‌‌గా క్లోజయ్యాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌‌ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ‘ఈ ఏడాది మార్చిలో వడ్డీ రేట్ల పెంపు ఉంటుందనే సంకేతాలను ఫెడ్ ఇవ్వడంతో గ్లోబల్‌‌గా మార్కెట్లు పడ్డాయని చెప్పారు. యూఎస్‌‌ ఇన్‌‌ఫ్లేషన్‌‌ 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో కూడా గ్లోబల్‌‌ మార్కెట్‌‌లు నష్టాల్లో ట్రేడయ్యాయని చెప్పారు.  కాగా, ఈ వారంలో సెన్సెక్స్ 1,478 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 443 పాయింట్లు ఎగిసింది. సెక్టార్ల పరంగా చూస్తే, బీఎస్‌‌ఈ టెలికం, ఎఫ్‌‌ఎంసీజీ, హెల్త్‌‌కేర్‌‌‌‌, ఆటో, బ్యాంకెక్స్ ఇండెక్స్‌‌లు 1.20 శాతం వరకు నష్టపోయాయి. క్యాపిటల్ గూడ్స్‌‌, రియల్టీ, ఇండస్ట్రీయల్స్‌‌, ఐటీ ఇండెక్స్‌‌లు లాభాల్లో ముగిశాయి. మిడ్‌‌ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌‌లు 0.50 శాతం వరకు లాభపడ్డాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 25 పైసలు తగ్గి 74.15 వద్ద సెటిలయ్యింది.