లగ్గమాయె.. పిల్లలాయె.. కల్యాణ లక్ష్మి రాకపాయె

లగ్గమాయె.. పిల్లలాయె.. కల్యాణ లక్ష్మి రాకపాయె
  • గత పది నెలల్లోనే లక్షా పదివేల అప్లికేషన్లు పెండింగ్​
  • 2.70 లక్షల మంది అప్లయ్​ చేస్తే,  ఇచ్చింది 1.60 లక్షల మందికే..
  • ఆఫీసుల చుట్టూ తిరిగి బేజార్​ అవుతున్న లబ్ధిదారులు
  • లిమిటెడ్​గా అప్లికేషన్ల క్లియరెన్స్​
  • పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకేనంటున్న ఆఫీసర్లు!
  • చెక్కుల పంపిణీలో లీడర్ల చేతివాటం
  • ఒక్కో బెనిఫిషియరీ నుంచి రూ. 20 వేలు వసూలు

హైదరాబాద్, వెలుగు: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్  స్కీమ్ కోసం అప్లయ్​ చేసుకొని ఏండ్లు గడుస్తున్నా చెక్కులు అందడం లేదు. కొన్ని చోట్ల లగ్గమై, పిల్లలు పుట్టినా డబ్బులు అందడం లేదు. సర్కారు సాయం వస్తుందన్న నమ్మకంతో అప్పు చేసి పెండ్లి చేసిన వారికి మిత్తీలు మీద పడ్తున్నాయి. సాయం కోసం వారు ఆఫీసుల చుట్టూ తిరిగి బేజార్​ అవుతున్నారు. ఆఫీసర్లను అడిగితే బడ్జెట్ రావడం లేదని చెప్తున్నారు.

సెకండ్​ టర్మ్​లో పట్టించుకుంటలె..

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీల్లోని నిరుపేద కుటుంబాల ఆడ పిల్లల పెండ్లికి ఆర్థిక సాయం అందజేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సీఎం కేసీఆర్​ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్  స్కీమ్​ను స్టార్ట్​ చేశారు. తొలుత సాయాన్ని రూ. 50 వేలుగా నిర్ణయించారు. 2017 ఏప్రిల్​ 1 నుంచి దాన్ని  రూ. 75 వేలకు పెంచారు. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 2018 ఏప్రిల్ 1 నుంచి ఆర్థిక సాయాన్ని రూ. లక్ష నూట పదహారుగా నిర్ణయించారు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్కీమ్  సక్కగా అమలు కావడం లేదు. 2020 ఏప్రిల్​ నుంచి ఈ ఏడాది జనవరి వరకు రెండు లక్షల 70 వేల మంది అప్లయ్​ చేసుకుంటే.. లక్షా 60 వేల మందికి మాత్రమే చెక్కులు ఇచ్చారు. ఇంకా లక్షా 10 వేల అప్లికేషన్లు పెండింగ్​లో ఉన్నాయి. 2018,  2019లో అప్లయ్​ చేసుకున్నవాళ్లలో కూడా కొందరికి ఇప్పటికీ డబ్బులు అందలేదు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్  పథకం కింద సాయం కోసం ఆడపిల్ల పెండ్లికి నెల ముందు లేదా పెండ్లయిన ఆరు నెలల్లోపు అప్లయ్​ చేసుకోవాలి. క్యాస్ట్, ఇన్ కం సర్టిఫికెట్లు, వధూవరుల ఆధార్ కాపీ జిరాక్స్, పెండ్లి పత్రిక, పెండ్లి కూతురు తల్లి  పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్ వివరాలు అందులో జత చేయాలి. ఏడాదికి ఆదాయం రూరల్​ ఏరియా వాళ్లయితే  రూ. లక్షన్నర, అర్బన్​ ఏరియా వాళ్లయితే  రూ. రెండు లక్షలు మించరాదు.  గ్రామ, మండల స్థాయిలో జరిగే  వెరిఫికేషన్  టైంలో లబ్ధిదారుల పేర్లు ఉంటున్నాయి. కానీ ఆర్డీవో ఆఫీసులో జరిగే వెరిఫికేషన్  టైంలో  కొన్ని, కలెక్టరేట్ లో జరిగే వెరిఫికేషన్ లో మరికొన్ని, హెచ్​వోడీ ఆఫీసులో జరిగే వెరిఫికేషన్​లో ఇంకొన్ని.. ఇట్ల అప్లికేషన్లు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయం ఎక్కువగా ఉందని, తప్పుడు సర్టిఫికెట్లు పెట్టారన్న సాకుతో అప్లికేషన్లను పక్కన పడేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్  టర్మ్​ టీఆర్​ఎస్​ సర్కారులో  మెజార్టీ స్థాయిలో శాంక్షన్లు జరిగేవి. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ స్కీమ్ కింద భారీగా కోతలు పెడ్తున్నారు. లిమిటెడ్ స్థాయిలోనే అప్లికేషన్లను క్లియర్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నట్టు ఆఫీసర్ల మధ్య డిస్కషన్  జరుగుతోంది.

సగం మిత్తీలకే

ఆడపిల్ల పెండ్లికి సర్కార్ నుంచి ఆర్థిక సాయం వస్తుందని చాలా మంది తల్లిదండ్రులు అప్పుచేసి పెండ్లి చేస్తున్నారు. ఐదారునెలల్లో చెక్కులు వస్తాయనుకుంటే.. అప్లయ్​చేసి ఏడాది, ఏడాదిన్నర గడుస్తున్నా  అందడం లేదు. దీంతో  అప్పులకు మిత్తీలు పెరిగిపోతున్నాయి. ఆఫీసుల చుట్టూ తిరుగంగ తిరుగంగ అప్లికేషన్లు క్లియర్ చేస్తున్నారని, కొన్ని చోట్లయితే అసలు పట్టించుకోవడమే లేదని పేరెంట్స్​ వాపోతున్నరు. ప్రభుత్వం నుంచి వచ్చే రూ. లక్షనూట పదహారులో సగం మిత్తీలకే సరిపోతున్నాయని వారు చెప్తున్నారు.

బ్రోకర్ల బెడద ఎక్కువే

కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ పథకంలో బ్రోకర్ల ప్రమేయం ఎక్కువైందన్న ఆరోపణలు ఉన్నాయి. అప్లికేషన్లు నేరుగా ఆన్ లైన్ లో చేసుకోవాలి. చెక్కులు మాత్రం నేరుగా లబ్ధిదారులకు అందడం లేదు. అవి లోకల్ ఎమ్మెల్యే ఆఫీసులకు వెళ్తాయి. ఎమ్మెల్యేలు తమ వీలును చూసుకుని లబ్ధిదారులను ఒకేసారి పిలిచి వాటిని అందిస్తున్నారు. ఇక్కడే బ్రోకర్ల బెడద ఉంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చెక్కుల కోసం లబ్ధిదారుల నుంచి గ్రామ స్థాయి లీడర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. తక్కువలో తక్కువ ఒక్కో చెక్కు పంపిణీకి రూ. 20 వేల వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఈ దోపిడీ వెనుక ఎమ్మెల్యేలు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి.

బడ్జెట్​ రాలేదంటున్నరు

మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రానికి చెందిన ముత్యాల సాహిత్యకు 2019 నవంబర్​ 6న పెండ్లయింది. కల్యాణ లక్ష్మి పథకం కింద అప్లికేషన్​ పెట్టుకున్నరు. ఏడాదిన్నర కావస్తున్నా సాయం అందలేదు. తహసీల్దార్​ ఆఫీసులో అడిగితే అప్లికేషన్​ పైకి పంపించామని, బడ్జెట్​ రాలేదని చెప్తున్నరు. ఇటీవలే ఆమెకు బాబు పుట్టాడు.

 

ఏడాదైనా చెక్కు రాలె

గతేడాది జనవరిలో మా అమ్మాయి పెండ్లి చేసినం. కల్యాణ లక్ష్మికి అప్లయ్​ చేసి ఏడాది అయింది. ఇప్పటి వరకు చెక్కు రాలేదు. సర్పంచ్, మండల ఆఫీసర్లను  అడిగితే  పెండింగ్ లో ఉందని, త్వరలోనే వస్తాయని అంటున్నరు. చెక్కులు వచ్చినప్పుడు పిలుస్తామని చెప్తున్నరు. – బొజ్జ లక్ష్మి, గుర్వాయిగూడెం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా.

 

మూడేండ్లుగా తిరుగుతనే ఉన్నం..

ఈమె పేరు హిమబిందు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారం. హన్మకొండ మండలం పైడిపల్లికి చెందిన ఆటో డ్రైవర్ రోహిత్ తో మూడేండ్ల క్రితం పెండ్లి జరిగింది. లగ్గమైన కొద్ది రోజులకే కల్యాణలక్ష్మి పథకం కోసం అప్లై చేశారు. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు. హిమబిందు తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తుంటారు. కల్యాణలక్ష్మికి అన్ని అర్హతలు ఉన్నాయని, మూడేండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరిగినా డబ్బులు రాలేదని హిమబిందు చెబుతోంది.

షాదీ అయ్యి రెండేండ్లు..

వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరికి చెందిన ఈమె పేరు  సమీనా. షాదీ అయి రెండేండ్లు. కొడుకు పుట్టి కూడా ఏడాది. షాదీ ముబారక్ చెక్కు వస్తుందని పుట్టింటి వాళ్లు దొరికినకాడల్లా అప్పు చేసి పెండ్లి చేశారు. ఆ వెంటనే షాదీ ముబారక్​కు అప్లై చేశారు. అప్పటినుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నరు. ఇప్పటికీ డబ్బులు రాలేదు. రేపొస్తయ్​.. మాపొస్తయ్​ అని ఆఫీసర్లు చెప్పి పంపుతున్నరు.

 

రేపు మాపు అంటున్నరు..

మా అమ్మానాన్న అప్పులు చేసి, తిప్పలు పడి ఏడాది కింద నాకు పెండ్లి చేసిన్రు. కల్యాణ లక్ష్మి పైసలు వస్తే కొంతన్న అప్పులు తీరుతయ్​ అనుకున్నరు. ఇంతవరకూ పైసా రాలేదు. పెద్ద సార్లను అడిగితే రేపు మాపు అంటున్నరు.  పైసలు జల్దీ అందేలా చూడాలి. ఇంట్లో ఆసరాగా ఉంటది. – టేకం లక్ష్మి, తాటి గూడ, తిర్యాణి, ఆసిఫాబాద్​ జిల్లా

 

ఇవి కూడా చదవండి

దీదీ కొత్త పథకం…రూ.5కే గుడ్డుతో భోజనం

ఈ పోలీసుల రూటే సెపరేటు.. ప్రజల్ని పరిగెత్తిస్తున్నారు

సింగి ల్ .. రెడీ టు మింగి ల్ ..