ఈదేశాడు… మొసళ్లున్నా లెక్కజెయ్యలె

ఈదేశాడు… మొసళ్లున్నా లెక్కజెయ్యలె

అది అసలే మొసళ్లున్న పెద్ద సరస్సు. కానీ, ఓ బైక్‌‌ రేసర్ తెగించాడు. ప్రకృతి అడ్డంకులు సృష్టించినా తట్టుకుని ఈదేశాడు. ఈతకు కొత్త అయినా ఓగాయం.. ఆ ఈతకు దారి చూపింది. కొత్తగా, నలుగురికి స్ఫూర్తి కలిగించేలా ఏదన్నా చేయాలనే ఆలోచనను పుట్టించింది. అడ్వెంచర్ తోపాటు రెండు గిన్నిస్బుక్ రికార్డులను తెచ్చి పెట్టింది. ఇంతకీ ఎవరతను?ఏమిటా కథ?

సోలోగా, పూర్తిగా..
45 ఏళ్ల మార్టిన్ హాబ్స్ ఒకే సారి రెండు రికార్డులు తనఖాతాలో వేసుకున్నాడు. ఆఫ్రికాలోని మలావి సరస్సును ఎక్కువ దూరం ఒంటరిగా ఈది ఒకటి, పూర్తిగా ఈది మరో రికార్డు సృష్టించాడు. మలావిని ఇప్పటి వరకు ఎవ్వరూ పూర్తిగా ఈదలేదు. దాదాపు 580కిలోమీటర్ల దూరం ఈదిన హాబ్స్, ఇందుకోసం 54రోజులు కష్టపడ్డాడు. రోజుకు 11 కిలోమీటర్ల చొప్పున ఈదుకుంటూ వెళ్లాడు. త్వరగా ముందుకు వెళ్లేందుకు, నొప్పిని తట్టుకునేందుకు.. తినే తిండి, చాక్లెట్ బార్ గురించి ఆలోచించే వాడినని హాబ్స్ చెప్పాడు.

వాతావరణం బాగాలేకపోవడం, ఒకటీ రెండు సార్లు టోర్నడోలు రావడంతో హాబ్స్​కు ఈదడం కష్టమైంది.ఇతడి వెంట వచ్చిన పడవ కొన్నిసార్లు ప్రమాదంలో పడింది. హాబ్స్ గతంలో బైకర్, మారథాన్ రన్నర్. అయితే అతడికి నడుము వద్ద ఫ్రాక్చర్ కావడంతో బైక్‌‌ రైడింగ్‌, రన్నింగ్​కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడికి మిగిలిన స్పోర్ట్ .. స్విమ్మింగ్ ఒక్కటే. తన గాయం నుంచి కోలుకునేందుకు, కొత్త అడ్వెంచర్ చేసేందుకు హాబ్స్​కు ఇది ఉపయోగపడింది. గతవారమే గిన్నిస్ రికార్డ్ నెలకొల్పినప్పటికీ, నది చివరివరకు వెళ్లేందుకు అతడు స్విమ్మింగ్ కొనసాగించాడు.