ఆమెని యుద్ధం వెంటాడుతోంది

ఆమెని యుద్ధం వెంటాడుతోంది

జీవితంలో అవకాశం వచ్చిన ప్రతిసారి యుద్ధం ఆమె కలల్ని కూల్చేసింది. ఆమె సొంత దేశం అఫ్గానిస్తాన్. తాలిబాన్లు మళ్లీ ఎంట్రీ ఇవ్వడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ఉక్రెయిన్​కి వెళ్లింది. అక్కడైనా హాయిగా బతకొచ్చు అనుకుంది. కానీ, రష్యా– ఉక్రెయిన్​ మధ్య జరుగుతున్న యుద్ధం  మళ్లీ ఆమెని కొత్త ఊరు వెతుక్కొనేలా చేసింది. రెండు యుద్ధాల్ని కళ్లారా చూసిన ఆమె యుద్ధమంటూ లేని ప్లేస్​లో బతకాలని అనుకుంటోంది. ‘అఫ్గానిస్తాన్​లో పుట్టడం అనేది నా ఛాయిస్​ కాదు’ అంటున్న ఆమె పేరు మసౌమ తాజిక్. ప్రాణాలతో ఉండడం కోసం, మంచి భవిష్యత్తు కోసం వలసపక్షిగా ఆమె పడుతున్న ఆవేదన ఇది..

కలలు కన్న జీవితాన్ని సొంతం చేసుకోవాలంటే ప్రాణాలతో ఉండాలి. అందుకోసం కుటుంబాన్ని, సొంత దేశాన్ని వదిలేసింది తాజిక్​. ఆమె అఫ్గానిస్తాన్​లోని అమెరికన్​ యూనివర్సిటీలో సాఫ్ట్​వేర్​ ఇంజనీరింగ్​, డేటా సైన్స్​  గ్రాడ్యుయేషన్​ చదివింది. చదువుకుంటూనే పాకెట్​ మనీ కోసం డేటా మేనేజ్​మెంట్​ అసిస్టెంట్​గా పనిచేసేది. వాళ్ల ఇంట్లో తనే పెద్దబిడ్డ కావడంతో తమ్ముళ్లు, చెల్లెండ్ల చదువుకి అయ్యే ఖర్చు తనే చూసుకునేది. ఆరు నెలల్లో పాస్​పోర్ట్​ తీసుకుని విదేశాల్లో మాస్టర్స్​ కోర్స్​ చేయాలనుకుంది. కొత్త దేశంలో అందమైన భవిష్యత్తును ఊహించుకుంది. కానీ, అంతలోనే తాలిబాన్లు అఫ్గానిస్తాన్​ని ఆక్రమించుకున్నారు. అక్కడే ఉంటే తన మాస్టర్స్​ కల ఆగిపోయినట్టే అనుకుంది తాజిక్​.  బ్యాగ్​ సర్దుకుని కాబుల్​ ఎయిర్​పోర్ట్​కి వెళ్లింది. అక్కడ ఆరు రోజుల తర్వాత వాల్​స్ట్రీట్​ జర్నల్ న్యూస్​పేపర్​ స్టాఫ్​తో కలిసి ఉక్రెయిన్​ విమానం ఎక్కింది. కీవ్​లోకి వచ్చిన ఆమెకి హ్యుమానిటేరియన్ వీసా ఇచ్చారు. ఆ వీసా గడువు 15 రోజులే.  ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఎక్కడ ఉండాలి? తాజిక్​కు అర్థం కాలేదు. ఆమెకి అక్కడి జర్నలిస్టులు అండగా నిలిచారు. వలస పక్షిగా పొరుగు దేశం వెళ్లడం తాజిక్​కి కొత్తేం కాదు. గతం లోనే ఆమె ఫ్యామిలీ ఇరాన్​లో కొన్నాళ్లు ఉన్నారు. 

ఫ్యామిలీ అంతా ఇరాన్​కి 
1989లో రష్యా– అఫ్గానిస్తాన్​ యుద్ధం జరగడంతో తాజిక్​ పేరెంట్స్​ ఇరాన్​ రాజధాని టెహ్రాన్​కి వలస వెళ్లారు. తాజిక్​ అక్కడే పుట్టింది. ఆరుగురు సంతానంలో ఆమె రెండోది. ఆమెను అక్కడి పిల్లలంతా ‘అఫ్గనీ’ అని ఆటపట్టించేవాళ్లు. అక్కడ అంతా పర్షియన్ మాట్లాడేవాళ్లు. తాజిక్​కు  ఇంగ్లీష్​ నేర్చుకోవాలని ఉండేది. అందుకోసం హాలీవుడ్​ సినిమా టేపులు కిరాయికి తెచ్చుకొని చూసేది. ఆ సినిమా ఇంగ్లీష్​ సబ్​టైటిల్స్​లో కొత్త పదం కనిపిస్తే నోట్​ చేసుకునేది. వారానికి ఒక సినిమా చూసేది. 

పాకెట్​లో  ఫోన్​ నెంబర్స్​ పేపర్​
2001లో అమెరికా, నాటో సైనికులు తాలిబన్లను తరిమేయడంతో అప్గానిస్తాన్​లో మామూలు పరిస్థితులు వచ్చాయి. దాంతో 2006లో తాజిక్​ ఫ్యామిలీ అఫ్గనిస్తాన్​లోని హెరాత్​ సిటీకి వచ్చింది. అక్కడే చదువు కంటిన్యూ చేసింది తాజిక్​. ఆమెకు 2016లో  యూఎస్​ ఎంబసీ స్కాలర్​షిప్​ వచ్చింది. దాంతో కాబుల్​లోని అమెరికన్ యూనివర్సిటీలో చదువుకునే ఛాన్స్​ దొరికింది. ఇరవై ఏండ్ల తర్వాత అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్​ని​ ఖాళీ చేసింది. దాంతో, ఇస్లామిక్​ స్టేట్​ గ్రూప్​ వాళ్లు కాబూల్​లోని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల​ మీద దాడి చేశారు. ఆ టైమ్​లో బయటికి వెళ్లినప్పుడు అందరిలానే తాజిక్ కూడా ఫ్యామిలీ ఫోన్​ నెంబర్స్​ ఉన్న కాగితాన్ని పాకెట్​లో పెట్టుకునేది. ఎందుకంటే... అనుకోకుండా బాంబు దాడిలో వాళ్లకు ఏమైనా జరిగితే, ఇంట్లోవాళ్లకు సమాచారం చెప్పడం ఈజీ అవుతుందని.

మళ్లీ యుద్ధం అడ్డొచ్చింది
ఉక్రెయిన్​ వచ్చాక కీవ్​లో ఫ్రీలాన్స్​గా కోడింగ్ జాబ్ చేసేది తాజిక్​. వచ్చిన దాంట్లో కొంత డబ్బు నెలనెలా హెరాత్​లో ఉంటున్న ఫ్యామిలీకి పంపించేది. ఈ ఏడాది జనవరిలోనే ఆమెకి న్యూజెర్సీలోని రుట్​గెర్స్​ యూనివర్సిటీలో మాస్టర్స్ అడ్మిషన్​ వచ్చింది. ఫిబ్రవరి 22న వీసా ఇంటర్వ్యూ. కానీ, రష్యా సైనిక దాడి కారణంగా కీవ్​లోని అమెరికన్​ ఎంబసీ మూతపడింది. మాస్టర్స్​ చేయాలనే ఆమె కలకి మళ్లీ యుద్ధం అడ్డొచ్చింది. ప్రాణాలు కాపాడుకునేందుకు కీవ్​ నుంచి లీవ్​ సిటీకి వెళ్లింది. అక్కడి నుంచి పోలండ్​కి వెళ్లి, ఆ దేశం వీసా కోసం ట్రై చేస్తోంది. ‘పోలండ్​ వీసా దొరికితే మళ్లీ అమెరికా స్టూడెంట్​ వీసా కోసం ప్రయత్నిస్తా’ అంటోంది తాజిక్​.  

స్టూడెంట్​ వీసా కోసం
మాస్టర్స్​ కోర్స్​  కోసం అమెరికా, బ్రిటన్​, జర్మనీలోని యూనివర్సిటీల్లో అప్లై చేసింది​ తాజిక్​. పబ్లిక్​ పాలసీ, హెల్త్​కేర్​లో డేటా సైన్స్​ కోర్స్​ చేయాలని అనుకుంటోంది. డేటా సాయంతో అవినీతిని నిర్మూలిం చడం ఎలా? సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేయడం ఎలా? అనే అంశంపై థీసిస్​ రాయాలనేది తాజిక్​ డ్రీమ్. రష్యా బలగాలు ఉక్రెయిన్​లోని మెయిన్​ సిటీల్ని చుట్టుముట్టే లోపే పోలండ్​కి వెళ్లాలని అనుకుంటోంది. ఈ లోపు అమెరికా స్టూడెంట్​ వీసా వస్తే ఆ దేశం ఫ్లయిట్​ ఎక్కే ఆలోచనల్లో ఉంది తాజిక్.  

వార్​ లేని లోకం అడిగా
 ‘‘ఇప్పుడు నేను చావుకు చాలా దగ్గర్లో ఉన్నా. యుద్ధం జరిగే చోట చిక్కుకుని, భయంతో బతకాలని అనుకోవడం లేదు. ప్రాణాలతో ఉండాలి అనుకుంటున్నా. నా ఒక్కదాని గురించే కాదు మా ఫ్యామిలీ అంతా నాపై ఆధారపడి ఉన్నారు. అఫ్గాన్​ పేరెంట్స్​ కడుపున పుట్టాలనేది నా ఛాయిస్​ కాదు. ఒకవేళ   బ్రిటన్​లో పుట్టి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదు. అఫ్గానిస్తాన్​ లాంటి దేశానికి చెందినందుకు ఇప్పుడు నా ప్రాణాల్ని పణంగా పెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు నా ఆలోచన ఒకటే...  ఈ భూమ్మీద యుద్ధమంటూ జరగని ప్లేస్​కి వెళ్లాలి. అక్కడే ఇల్లు తీసుకోవాలి. ఆ ఇంట్లోని షెల్ఫ్​​లన్నిటినీ పుస్తకాలతో నింపేయాలి” అంటూ గుండె లోతుల్లోని బాధని చెప్పుకుంది తాజిక్.