దంచుతున్న ఎండలు.. రాష్ట్రంలో 40 డిగ్రీలపైనే టెంపరేచర్

దంచుతున్న ఎండలు.. రాష్ట్రంలో 40 డిగ్రీలపైనే టెంపరేచర్
  • అత్యధికంగా దామెరచర్లలో 45.3 డిగ్రీలు
  • మధ్యాహ్నం బయటకెళ్లొద్దంటున్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా ఎండలు దంచుతున్నయి. అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. నల్గొండ జిల్లా దామెరచర్లలో అత్యధికంగా 45.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌‌లో 45.1 డిగ్రీల టెంపరేచర్ నమోదవగా, నల్గొండ జిల్లా నిడమనూర్‌‌లో 44.9 డిగ్రీలు, ములుగు జిల్లా తాడ్వాయిలో 44.4, రామగుండంలో 44.4, కరీంనగర్‌‌ జిల్లా వీణవంకలో 44.3, పెద్దపల్లి జిల్లా రంగంపల్లిలో 44.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.

హైదరాబాద్‌‌లో 40.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు ఐఎండీ తెలిపింది. ఎండ, ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బంది పడుతుండగా, మరో నాలుగైదు రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. గర్భిణులు, పిల్లలు, వృద్ధులు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని చెబుతున్నారు. వీళ్లు త్వరగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

జాగ్రత్తలు తప్పనిసరి : శ్రీనివాసరావు, హెల్త్​ డైరెక్టర్

‘ఎక్కువ ఎండలో తిరిగి వడదెబ్బ తగిలితే శరీరంలో నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటది. శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది” అని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కొన్నిసార్లు ప్రాణాపాయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదన్నారు. గొడుగు తీసుకెళ్లాలని, తరచూ నీళ్లు, పండ్ల రసాలు తాగుతుండాలన్నారు.

వడదెబ్బతో ఇద్దరి మృతి

హసన్‌‌పర్తి/లక్సెట్టిపేట, వెలుగు: వడదెబ్బతో సోమవారం ఓ ఉపాధి కూలీ, కానిస్టేబుల్ చనిపోయారు. హనుమకొండ జిల్లా హసన్‌‌పర్తి మండలం సిద్దాపూర్‌‌ గ్రామానికి చెందిన ముస్కు పెంటు (57) రోజుమాదిరిగానే సోమవారం కూడా ఉపాధి పనికి వెళ్లాడు. పనులు చేస్తుండగా ఎండ దెబ్బకు గురై కిందపడిపోయాడు. గమనించిన తోటి కూలీలు హాస్పిటల్‌‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. అలాగే, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణానికి చెందిన కానిస్టేబుల్ వడదెబ్బతో మృతి చెందాడు. టౌన్​లోని అంకతివాడకు చెందిన ముత్తె సంతోష్​(45) రామకృష్టాపూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సంతోష్ తన స్వగ్రామానికి వచ్చాడు. వడ దెబ్బ తగిలి  ఆదివారం రాత్రి మృతి చెందాడు.