PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం

PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం

గువాహటి వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ బ్యాటర్లు తడబడ్డారు. పంజాబ్‌ పేసర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో.. పరుగులు చేయలేక చేతులెత్తేశారు. 200పై చిలుకు పరుగులు చేయాల్సిన పిచ్‍పై స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.

రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్(34 బంతుల్లో 48; 6 ఫోర్లు) ఒక్కడు ఒంటరి పోరాటం చేశాడు. అతని తరువాత అంతో ఇంతో రాణించిన బ్యాటరంటే.. రవిచంద్రన్ అశ్విన్(19 బంతుల్లో 28; 3 ఫోర్లు, ఒక సిక్స్). నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన భారత వెటరన్ స్పిన్నర్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అదే సమయంలో ఔటయ్యే ముందు విలువైన పరుగులు చేసి వెళ్ళాడు. 

దేశం తరుపున పరుగుల వరద పారించిన  జైస్వాల్(4).. ఐపీఎల్‌లో మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. ఆట ప్రారంభమైన నాలుగో బంతికే పెవిలియన్ చేరిపోయాడు. అనంతరం కెప్టెన్ సంజు శాంసన్ (15 బంతుల్లో 18), టామ్ కోహ్లెర్ కాడ్‌మోర్ (18) జోడికి మంచి ఆరంభాలు లభించిన భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లూ అంతే. వారినే అనుసరించారు. ధృవ్ జురెల్(0) ఎదుర్కొన్న తొలి బంతికే ఔటవ్వగా.. రోవ్మాన్ పావెల్(4), డోనోవన్ ఫెరీరా(7) నిరాశ పరిచారు. దీంతో రాయల్స్ కనీసం పోరాడే లక్ష్యాన్ని చేరుకోలేపోయింది.

కింగ్స్ బౌలర్లందరూ చాలా ప్లాన్‌గా బంతులేశారు. వికెట్ల వేటలో పైచేయి సాధించకపోయినా.. పరుగులు రాకూండా కట్టడి చేశారు. సామ్ కర్రన్, రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ త్రయం రెండేసి వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్, నాథన్ ఎల్లిస్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.