మేం పవర్‌లోకి వస్తే బ్రాహ్మణులు సేఫ్

మేం పవర్‌లోకి వస్తే బ్రాహ్మణులు సేఫ్

లక్నో: వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార, విపక్ష పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతున్నారు. ఆ రాష్ట్ర మాజీ సీఎం మాయావతి ఎన్నికల హీట్‌ను పెంచుతున్నారు. యూపీ ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తోందని బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు. బ్రాహ్మణ ఓటర్లను తప్పువైపు తిప్పుకునేందుకు బీజేపీ కుటిల యత్నాలు చేస్తోందని ఆరోపించారు. బీఎస్పీ అధికారంలోకి వస్తేనే బ్రాహ్మణుల అభివృద్ధి, ప్రయోజనాలు నెరవేరుతాయని మాయవతి స్పష్టం చేశారు. బ్రాహ్మణ కమ్యూనిటీ సేఫ్టీ బాధ్యత తమదేనని తెలిపారు. 

‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణులు బీజేపీకి ఓటెయ్యబోరని నమ్ముతున్నా. దళితుల్లాగే బ్రాహ్మణులు కూడా మా పార్టీకి మద్దతుగా ఉండాలని కోరుతున్నాం. డబ్బుల పంపిణీతోపాటు తప్పుడు వాగ్దానాలతో దళితులను తమ వైపు మళ్లించుకోవాలని బీజేపీ యత్నించింది. కానీ వారు బీజేపీకి లొంగకుండా బీఎస్పీ వైపే ఉన్నారు. కాబట్టి బ్రాహ్మణులు కూడా మాకు సపోర్ట్‌గా ఉండాలని కోరుతున్నాం. గత ఎన్నికల్లో బ్రాహ్మణ కమ్యూనిటీ బీజేపీకి మద్దతుగా నిలిచింది. ఈసారైనా బీజేపీ ప్రలోభాలు, తప్పుడు వాగ్దానాలకు తలొగ్గకుండా బ్రాహ్మణులు మాకు అండగా ఉండాలి’ అని మాయవతి కోరారు.