ఆకస్మిక పర్యటనలో చెత్త ఎత్తి పోసిన కలెక్టర్

ఆకస్మిక పర్యటనలో చెత్త ఎత్తి పోసిన కలెక్టర్

సస్సెండ్​ చేసిండు.. చెత్త ఎత్తి పోసిండు

దమ్మాయిగూడ, నాగారంలో మేడ్చల్​ కలెక్టర్ పర్యటన

పని చేయని ఇద్దరి సస్పెన్షన్​

కీసర, వెలుగు: ‘మన నగరం’లో భాగంగా కలెక్టర్ ఎంవీ రెడ్డి దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్ గూడ రాజీవ్ గృహకల్ప కాలనీలో గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గృహకల్ప కాలనీ గ్రౌండ్ లో చెత్తను చూసిన కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ రామలింగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గ్రౌండ్ లో ఉన్న చెత్తను స్వయంగా తొలగించారు. అనంతరం బిల్ కలెక్టర్ శ్రీధర్, సానిటేషన్ సూపర్ వైజర్ వెంకటేష్ ను సస్పెండ్ చేయాలని కమిషనర్ ను ఆదేశించారు. కాలనీలో వీధి లైట్లు ఏర్పాట్లు చేయాలని, విద్యుత్​ ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ నిర్మించాలని ఏఈని ఆదేశించారు. అహ్మద్ గూడ నుంచి జవహర్ నగర్ కు వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలమయంగా ఉన్నందున మర్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. శ్మశానవాటికకు వెళ్లే రోడ్డు మార్గం బాగా లేనందున మట్టి పోయించాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.

అనంతరం నాగారం మున్సిపాలిటీలో పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలోని చేపట్టిన పనులను పరిశీలించారు. వెస్ట్ గాంధీ నగర్ కాలనీలో ఇటీవల డెంగీతో మరణించిన సంజీవ కుటుంబాని పరామర్శించారు. సంజీవ భార్య జ్యోతి ముగ్గురు పిల్లలను పోషించడం కష్టంగా ఉందని స్థానికులు కలెక్టర్ కు తెలియజేయడంతో ఆమెకు ఔట్​సోర్సింగ్​లో ఉద్యోగం కల్పించి,పెన్షన్ ఇవ్వాలని, ముగ్గురు పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్ లో చదివించేందుకు చర్యలు చేపట్టామని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. వికాస్ నగర్ కాలనీలోని అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం దమ్మాయిగూడ, నాగారం మున్సిపల్ కమిషనర్, అధికారులతో నాగారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి అభివృద్ధి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాగారం మున్సిపల్ కమిషనర్ వసంత రెడ్డి, దమ్మాయిగూడ కమిషనర్ రామలింగం, స్థానిక తహసీల్దార్ నాగరాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు –

సైంటిస్టుల హెచ్చరిక.. ఆరో ప్రళయం ఆరంభం

రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి