ప్రైవేటు వర్సిటీల చూపు.. తెలంగాణ వైపు

ప్రైవేటు వర్సిటీల చూపు.. తెలంగాణ వైపు

తెలంగాణ రాష్ట్రంలో పలు ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీలు త్వరలో ప్రైవేటు యూనివర్సిటీలుగా మారనున్నాయి. ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర సర్కారు గైడ్‌లైన్స్‌ ప్రకటించడంతో.. ఆయా కాలేజీల మేనేజ్​మెంట్లు సంబంధిత ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. దరఖాస్తు నమూనా కోసం సెక్రటేరియెట్‌, ఉన్నత విద్యామండలి చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు వారం రోజుల్లోగా దరఖాస్తు నమూనాను వెబ్‌సైట్‌లో పెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

పలు ప్రైవేటు వర్సిటీల ఆసక్తి

రాష్ర్టంలో ప్రైవేటు యూనివర్సిటీలు పెట్టేందుకు జాతీయస్థాయి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ర్టంలోని ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల సొసైటీలతోపాటు స్కూల్స్‌ కూడా ముందుకొస్తున్నాయి. వాహనాల తయారీ రంగంలో ఉన్న హోండా సంస్థ, బెంగళూరులోని అమృత యూనివర్సిటీ, పంజాబ్‌ జలంధర్‌లోని లవ్‌లీ వర్సిటీ, ఢిల్లీ నోయిడాలోని అమిటీ వర్సిటీ వంటి సంస్థలు విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. దుబాయ్‌కి చెందిన ఓ సంస్థతో పాటు టెక్‌ మహేంద్ర, జిందాల్‌, సింగానియా తదితర సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే నగర శివార్లలో స్థలాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిసింది.

ఇంజనీరింగ్‌ కాలేజీల హవా

ప్రైవేటు వర్సిటీలుగా మారేందుకు రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీలు ఆసక్తి చూపుతున్నాయి. వర్సిటీ ఏర్పాటుకు ల్యాండ్‌ కీలకం. హెచ్‌ఎండీఏ పరిధిలో 20 ఎకరాలు, ఇతర ప్రాంతాల్లో 30 ఎకరాల స్థలం ఉండాలనే రూల్ ఉంది. 20, 30 ఏండ్ల కింద నగర శివార్లలో తక్కువ ధరలకు భూములు లభించడంతో మేనేజ్​మెంట్లు ముందు జాగ్రత్తగా ఎక్కువ భూమిని కొని పెట్టుకున్నాయి. దీంతో వర్సిటీ ఏర్పాటుకు పెద్ద అడ్డంకి తొలగింది. ప్రధానంగా సీబీఐటీ, అనురాగ్‌, వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి, మల్లారెడ్డి, శ్రీనిధి.. ఇలా పలు కాలేజీల మేనేజ్​మెంట్లు.. వర్సిటీలు పెట్టేందుకు ముందుకొస్తున్నట్టు తెలిసింది. మరోపక్క విజ్ఞాన్‌, కేఎల్‌ వర్సిటీతో పాటు పలు డీమ్డ్‌ వర్సిటీలు కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.