
ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ తనపై దాడి చేశాడని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలు నిజమేనని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్ చెప్పారు. కార్యదర్శి బిభవ్ కుమార్ సోమవారం(మే 13) సీఎం అధికారిక నివాసంలో ఎంపీ స్వాతి మలివాల్‌తో అసభ్యంగా ప్రవర్తించారని, ఈ విషయంలో కేజ్రీవాల్ కఠిన చర్యలు తీసుకుంటారని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ తెలిపారు.
ఈ ఘటనపై మే 14వ తేదీ మంగళవారం సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. "సోమవారం ఎంపీ మలివాల్, అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలవడానికి వెళ్ళారు. ఆమె డ్రాయింగ్ రూమ్‌లో సీఎంను కలవడానికి వేచి ఉండగా.. బిభవ్ కుమార్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది అత్యంత ఖండించదగిన ఘటన. కేజ్రీవాల్ దీనిపై ఆగ్రహం ఉన్నారు. ఈ సంఘటనపై కఠిన చర్యలు తీసుకుంటారు” అని తెలిపారు.
మలివాల్ సోమవారం సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బంది సీఎం అధికారిక నివాసంలో తనపై దాడి చేసినట్లు ఆరోపించారని పోలీసు అధికారులు తెలిపారు.