- భక్తుల నుంచి అనూహ్య స్పందన
- జాతరలో తొలిసారిగా స్పెషల్ అట్రాక్షన్
- ఇటీవల కేబినెట్ మీటింగ్‌లో సీఎంతోపాటు మంత్రులకు పంపిణీ
- మేడారంలో 10 స్టాల్స్ ఏర్పాటు
- ఆదివాసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారీ
హైదరాబాద్, వెలుగు: వనదేవతల జాతరలో ఈసారి ఇప్పపువ్వు లడ్డూలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మేడారం మహా జాతర చరిత్రలో మొదటిసారిగా సమ్మక్మ–సారలమ్మ మహిళా రైతు ఉత్పత్తుల సంఘం ఆధ్వర్యంలో తయారు చేసిన లడ్డూలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. అత్యంత పోషకాలు కలిగిన ఈ లడ్డూలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. జాతరలోనే కాకుండా ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలోనూ సీఎం, డిప్యూటీ సీఎం సహా మంత్రులందరికీ ఈ లడ్డూలను పంపిణీ చేశారు.
కాగా, ఈ నెల 13న మంత్రి సీతక్క చేతుల మీదుగా మేడారంలో ఇప్పపువ్వు లడ్డూ స్టాల్స్ ప్రారంభమయ్యాయి. జాతర పరిసరాల్లో మొత్తం 10 స్టాల్స్ ఏర్పాటు చేశారు. 250 గ్రాముల బాక్సు ధర రూ.150గా నిర్ణయించారు. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే సుమారు రూ.3 లక్షల వ్యాపారం జరిగిందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మహిళలకు ఆర్థిక భరోసా..
గిరిజన మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) ఆధ్వర్యంలో గవర్నర్ దత్తత గ్రామమైన కొండపర్తిలో మహిళలు శిక్షణ పొందారు. ఉట్నూర్ ఐటీడీఏ ప్రత్యేక బృందం ద్వారా లడ్డూ తయారీ, మార్కెటింగ్‌పై ట్రైనింగ్ ఇచ్చారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొండపర్తిలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. సమ్మక్క–సారలమ్మ మహిళా రైతు ఉత్పత్తుల సంఘం పేరుతో ఈసం మంగవేణి, ఇర్ప మంజుల, కన్నేపల్లి గ్రామానికి చెందిన చెరుప నాగమణి బృందం ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్, ఫుడ్ లైసెన్స్ పొంది వీటిని తయారు చేస్తున్నారు.
ఇప్పపువ్వు లడ్డూలో పోషకాలు..
ఇప్పపువ్వు లడ్డూలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఇది తింటే జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, బరువు నియంత్రణ, డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు. పూర్వకాలం నుంచి ఆదివాసీలు అనేక రోగాలకు ఇప్పపువ్వును మందుగా వాడేవారు. ఇప్పటికీ గొత్తికోయ గూడేల్లో పిల్లలకు ఇప్పపువ్వు కుడుములు, లడ్డూలు తినిపిస్తుంటారు. గర్భిణులకు ఈ లడ్డూ ఎంతో మేలు చేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్, విటమిన్లు, ఖనిజ లవణాలు తల్లితోపాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి దోహదపడతాయి.
