న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా విశ్వరూపం చూపించింది. ప్రత్యర్థి కివీస్ ను పసికూనగా మార్చేసి చిత్తుచిత్తుగా ఓడించారు. 154 పరుగుల టార్గెట్ ను కేవలం 10 ఓవర్లలోనే ఫినిష్ చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మ (20 బంతుల్లో 60: 7 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (26 బంతుల్లోనే 57: 6 ఫోర్లు, 3 సిక్సర్లు) విశ్వ రూపం చూపించి కివీస్ కు ఘోరమైన పరాభవాన్ని మిగిల్చారు. ఆదివారం (జనవరి 25) గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.
బౌలింగ్ లో బుమ్రా, బిష్ణోయ్ చెలరేగేడంతో పాటు బ్యాటింగ్ లో అభిషేక్ చుక్కలు చూపించి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను ఇండియా మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
హోరెత్తించిన అభిషేక్, సూర్య:
154 పరుగుల స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. పేలవ ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ తొలి బంతికే డకౌటయ్యాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రెండో బంతికే సిక్సర్ కొట్టి తన దూకుడు చూపించాడు. తొలి ఓవర్ లోనే ఒక సిక్సర్, రెండు ఫోర్లు కొట్టాడు. మరో ఎండ్ లో అభిషేక్ శర్మ కూడా చెలరేగడంతో ఇండియా తొలి 3 ఓవర్లలో 49 పరుగులు రాబట్టింది. 12 బంతుల్లోనే 28 పరుగులు చేసి కిషాన్ ఔట్ కావడంతో ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. ఈ దశలో సూర్య తో కలిసి అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
వరుస బౌండరీలతో గ్రౌండ్ ను హోరెత్తించాడు. ఈ క్రమంలో కేవలం 14 బంతుల్లోనే అభిషేక్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. గత మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చిన సూర్య కుదురుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. అభిషేక్ తో కలిసి బౌండరీల మోత మోగించాడు. వీరిద్దరి విధ్వంసానికి ఇండియా మరో 10 ఓవర్లు ముంగిలి ఉండగానే విజయం సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ, సోది తలో వికెట్ పడగొట్టారు. సూర్య 26 బంతుల్లోనే 57 పరుగులు.. అభిషేక్ శర్మ 20 బంతుల్లోనే 68 పరుగులు చేసి అజేయంగా నిలిచారు
స్వల్ప స్కోర్ కే పరిమితమైన న్యూజిలాండ్:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ తొలి ఓవర్ లోనే వికెట్ కోల్పోయింది. పాండ్య పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ తో కాన్వే ఔటయ్యాడు. రెండో ఓవర్లో హార్దిక్ బంతితో మ్యాజిక్ చేశాడు. రచీన్ రవీంద్రను ఔట్ చేసి టీమిండియాకు రెండో వికెట్ అందించాడు. కాసేపటికే సీఫెర్ట్ కూడా ఔట్ కావడంతో న్యూజిలాండ్ 34 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో కివీస్ ను ఆదుకునే బాధ్యత ఫిలిప్స్, చాప్ మాన్ తీసుకున్నారు. ఇద్దరూ కూడా భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగి స్కోర్ కార్డును ముందుకు తీసుకెళ్లారు.
వీరిద్దరి జోడీ నాలుగో వికెట్ కు 52 పరుగులు జోడించిన తర్వాత బిష్ణోయ్ చాప్ మాన్ ఔట్ చేసి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి కివీస్ పూర్తిగా పరుగులు చేయడంలో తడబడుతూ వచ్చింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లను కోల్పోతూ వచ్చారు. సాంట్నర్ (27) ఒక్కడే ఒక ఎండ్ లో పోరాడి జట్టు స్కోర్ ను 150 పరుగుల మార్క్ కు చేర్చాడు. ఇండియన్ బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు.. బిష్ణోయ్, హార్దిక్ పాండ్య చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హర్షిత్ రానాకు ఒక వికెట్ దక్కింది.
