- భూభారతిలో రోజుకు సగటున 1,500 నుంచి 2 వేల రిజిస్ట్రేషన్లు
- నిలిచిపోయిన దాదాపు 30 వేల పాస్‌బుక్స్
- చెన్నైలోని ప్రింటింగ్ ఏజెన్సీకి ముద్రణ బాధ్యతలు
- ఆర్డర్ రెన్యూవల్, పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకపోవడం
- వల్లనే సమస్య ఆందోళనలో వేలాది మంది రైతులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతున్నది. భూభారతి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు, ఇతర లావాదేవీలు సజావుగా సాగుతున్నప్పటికీ.. పాస్ పుస్తకాల ముద్రణ మాత్రం గతేడాది ఆగస్టు నుంచి నిలిచిపోయింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రింటింగ్ ఏజెన్సీకి పాస్ బుక్కుల ముద్రణకు సంబంధించిన ఆర్డర్ రెన్యూవల్ కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల దాకా పాస్‌బుక్కులు ముద్రణ కాక పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. పరిపాలనాపరమైన అనుమతులు, నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యం కారణంగా పాస్ పుస్తకాల పంపిణీకి అంతరాయం ఏర్పడిందని సమాచారం. దీంతో రిజిస్ట్రేషన్ పూర్తయిన రైతులు పాస్ పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు.
రూ.3 కోట్ల బిల్లులు పెండింగ్..
రాష్ట్రవ్యాప్తంగా భూలావాదేవీల ప్రక్రియ భూభారతి పోర్టల్ ద్వారా కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్లు, భాగ పరిష్కారాలు, విరాసత్ వంటి మార్పుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 1,500 నుంచి 2 వేల వరకు దరఖాస్తులు పరిష్కారమవుతున్నాయి. ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సాధారణంగా నెల రోజుల్లోపు రైతులకు పోస్టు ద్వారా పాస్ పుస్తకాలు అందాల్సి ఉంటుంది. అయితే గత నాలుగైదు నెలలుగా కొత్త పాస్ పుస్తకాల ముద్రణ జరగకపోవడంతో క్షేత్రస్థాయిలో వాటి పంపిణీ పూర్తిగా ఆగిపోయింది. పాస్ పుస్తకం జారీ కోసం నిబంధనల ప్రకారం రూ.300 ఫీజు చెల్లిస్తున్నప్పటికీ, పుస్తకాలు రాకపోవడంతో రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పాస్ పుస్తకాల ముద్రణ తమిళనాడులోని చెన్నై కేంద్రంగా జరుగుతున్నది. అయితే, సంబంధిత ఏజెన్సీకి ఇవ్వాల్సిన ప్రింటింగ్ ఆర్డర్ గడువు ముగియడం, దానిని సకాలంలో రెన్యూవల్ చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. అలాగే, చెన్నైకి చెందిన సదరు ఏజెన్సీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సుమారు రూ.3 కోట్ల దాకా బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సీసీఎల్‌ఏ నుంచి బిల్లుల చెల్లింపు ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు వెళ్లినప్పటికీ, అక్కడి నుంచి అనుమతులు రాకపోవడంతో ముద్రణ ప్రక్రియ నిలిచిపోయింది. అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నా, సమస్య పరిష్కారానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రైతులకు తప్పని ఇబ్బందులు..
పాస్ పుస్తకాల ఫిజికల్ కాపీ చేతికి అందకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడాల్సి వస్తోంది. అత్యవసర పనుల కోసం ఈ–పాస్‌బుక్ (డిజిటల్ కాపీ)ని వినియోగించుకోవచ్చని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంత రైతులు ఫిజికల్ కాపీ ఉంటేనే తమ భూమిపై పూర్తి భరోసా ఉంటుందని భావిస్తున్నారు. కేవలం డిజిటల్ రికార్డులపై ఆధారపడటం వల్ల క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. పాస్‌బుక్ జారీ ప్రక్రియలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి, పెండింగ్‌లో ఉన్న పుస్తకాలను త్వరగా క్లియర్ చేయాలని వారు కోరుతున్నారు. పాస్ పుస్తకం లేకపోవడం వల్ల రైతులు ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందేందుకు, యంత్రాల కొనుగోలు రుణాలు తీసుకునేందుకు పాస్‌బుక్ లేకపోవడం అడ్డంకిగా మారింది. అలాగే రైతు భరోసా , రైతుబీమా వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని పొందడంలోనూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయడం ద్వారా ముద్రణ ప్రక్రియను పునరుద్ధరించాలని, ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతున్నారు.
పాస్‌బుక్ లేక లోన్ రాలే..
నల్గొండ జిల్లాకు చెందిన ఒక రైతు ఇటీవల మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. భూభారతి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. డిజిటల్ రికార్డుల్లో భూమి ఆయన పేరు మీదకు మారింది. యాసంగి పంట పెట్టుబడి కోసం బ్యాంకుకు వెళ్లి రుణం అడిగితే.. ‘కొత్త పాస్ బుక్ ఫిజికల్ కాపీ తీసుకురండి’ అని మేనేజర్ అడిగారు. ఆన్‌లైన్‌లో ఉన్నా కూడా బ్యాంక్ నిబంధనల ప్రకారం అసలు పుస్తకం తనఖా పెడితేనే లోన్ ఇస్తామని చెప్పారు. పుస్తకం ముద్రణ ఆగిపోవడంతో అటు రుణం రాక, ఇటు ప్రైవేట్ వడ్డీలకు తెచ్చుకోలేక ఆ రైతు ఇబ్బంది పడుతున్నాడు.
భూమి అమ్ముకోలేకపోయిండు..
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక ఎన్నారై భూమిని అమ్ముకోవడానికి స్వదేశానికి వచ్చాడు. కొనుగోలుదారుడు సిద్ధంగా ఉన్నప్పటికీ, సర్వే నంబర్ల ప్రకారం అప్‌డేటెడ్ పాస్ బుక్ రాలేదు. స్లాట్ బుక్ చేసుకున్నా, కొత్త పుస్తకం ప్రింట్ అయి వస్తేనే రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంటుందని కొనుగోలుదారుడు భయపడుతున్నాడు. ముద్రణ ఆలస్యం వల్ల ఎన్నారై సెలవుల గడువు ముగిసిపో తుండటంతో భూమి అమ్మకం లావాదేవీని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
