చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన విషాదం నింపింది. మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ కాటారపు నాగరాజు(39)కు బస్సు నడుపుతుండగా గుండె పోటు వచ్చింది. గుండెపోటు వచ్చే సంకేతాలు ముందే తెలియడంతో ప్రయాణికులకు ఏం కాకూడదని బస్సును ఈ డ్రైవరన్న పక్కకు ఆపేశాడు.
చౌటుప్పల్ దగ్గర బస్సు నిలిపివేశాడు. వెంటనే.. రోడ్డు పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ క్లినిక్కు చికిత్స నిమిత్తం వెళ్లాడు. చికిత్స పొందుతూ క్లినిక్లోనే ప్రాణాలు కోల్పోయాడు. తన ప్రాణాల మీదకు వచ్చిందని తెలిసి కూడా బస్సును పక్కకు ఆపేసిన డ్రైవర్ చనిపోయిన విషయం తెలిసి ప్రయాణికులు బాధపడ్డారు. సదరు డ్రైవరన్న కుటుంబానికి సమాచారం అందించారు.
తెలంగాణ ఆర్టీసీలో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రతి నెలా పదుల సంఖ్యలో డ్రైవర్లు రిటైర్డ్ అవుతుండడం, కొత్త వారి రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో ఉన్న వారిపై రోజురోజుకు పనిభారం పెరుగుతోంది. ఓ వైపు మానసిక ఒత్తిడి.. మరో వైపు శారీరక శ్రమతో డ్రైవర్లు స్టీరింగ్‌పైనే ప్రాణాలు వదులుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరు నెలల కాలంలో డ్యూటీలో ఉండగానే గుండెపోటుతో ఐదుగురు ఆర్టీసీ డ్రైవర్లు చనిపోగా.. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఆర్టీసీలో వెయ్యి మంది డ్రైవర్ల నియామకం కోసం ఇటీవల పోలీస్ రిక్రూట్‌మెంట్‌బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఆ పోస్టులను మాత్రం భర్తీ చేయలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న డ్రైవర్లతో బస్సులను నడిపిస్తున్నారు. డ్రైవర్ల కొరత ఎక్కువగా ఉండడంతో డబుల్ డ్యూటీలు చేయాల్సిందేనని డిపో మేనేజర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో పని ఒత్తిడి పెరిగి డ్రైవర్లు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు.
బాధితుల్లో 45 నుంచి 50 ఏండ్ల మధ్య వయస్సు వారే ఎక్కువగుండెపోటుకు గురవుతున్న ఆర్టీసీ డ్రైవర్లలో 45 ఏండ్ల నుంచి 55 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న వారే ఎక్కువగా ఉంటున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల సమయంలోనే ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారని, రోజురోజుకు పెరుగుతున్న పనిభారమే ఇందుకు కారణమని డాక్టర్లు చెబుతున్నారు.
వాస్తవానికి ప్రతి డ్రైవర్ ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదు. కొరత కారణంగా ప్రతి డ్రైవర్‌కు ఓవర్ టైం డ్యూటీలు వేస్తుండడంతో 12 నుంచి 14 గంటలు పనిచేయాల్సి వస్తోంది. లాంగ్ రూట్‌లో నడిచే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉంటున్నా.. కండక్టర్ లేకపోవడంతో ఆ డ్యూటీ కూడా డ్రైవర్ల పైనే పడుతోంది.
