- సమాచారం లేకుండా ఇండ్ల కూల్చివేతలపై పిటిషన్
హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల గ్రామంలో భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ గ్రామస్తులు టి. వెంకటనరసమ్మతో పాటు మరో 23 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూదాన్ భూముల్లోని ఆక్రమణలను తొలగించాలంటూ జనవరి 17న భూదాన్ బోర్డు అధీకృత అధికారిగా ఉన్న సీసీఎల్‌ఏ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూదాన్ యజ్ఞ బోర్డు 2017 మేలో 100 చదరపు గజాల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించుకునేందుకు పట్టాలు జారీ చేసిందని, ఆ ఆధారంగా ఇళ్లు నిర్మించుకున్నామని తెలిపారు. అయితే ఈ భూములు భూదాన్ భూములేనని పేర్కొంటూ ఆక్రమణలుగా పరిగణించి వాటిని తొలగించాలని సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీ చేయడంతో, రెవెన్యూ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా గత నెల 24న ఇళ్లను కూల్చివేశారని పేర్కొన్నారు.
