మ్యాపులు, బిట్ పేపర్లపై హాల్‌‌టికెట్ నంబర్ వేయొద్దు : ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి

మ్యాపులు, బిట్ పేపర్లపై హాల్‌‌టికెట్ నంబర్ వేయొద్దు : ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి
  •     టెన్త్ ఎగ్జామ్స్ ఇన్విజిలేటర్లకు ఎస్​ఎస్సీ బోర్డు  డైరెక్టర్ శ్రీహరి ఆదేశాలు 
  •     ప్రశ్నపత్రం పార్ట్- ఏ లోని ప్రతి పేజీపై నంబర్ ఉండాల్సిందే 
  •     ఈ నెల 23న ఇంగ్లీష్ ఎగ్జామ్.. పార్ట్- ఏ, బీ పేపర్లు ఒకేసారి పంపిణీ 

హైదరాబాద్, వెలుగు: టెన్త్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌‌ను ప్రశ్నపత్రంలోని పార్ట్- ఏ లోని అన్ని పేజీల మీద స్పష్టంగా రాయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి సూచించారు. అయితే, పొరపాటున కూడా పార్ట్- బీ (బిట్ పేపర్), గ్రాఫ్ షీట్లు లేదా మ్యాపుల మీద హాల్ టికెట్ నంబర్ రాయకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ మెయిన్ ఆన్సర్ బుక్​లెట్ నంబర్ ను మాత్రం ఓఎంఆర్ షీట్లు, పార్ట్- బీ, మ్యాపులు, గ్రాఫ్ షీట్లపై కచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. 

ఈ మేరకు డీఈఓలకు పీవీ శ్రీహరి ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు, విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలను మరోసారి గుర్తు చేశారు. ఇన్విజిలెటర్లు ఆన్సర్ షీట్లు, మ్యాపుల విషయంలో పొరపాట్లు జరగకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నెల 23న జరగనున్న ఇంగ్లీష్ పరీక్షా నిర్వహణపై ఆయన పలు సూచనలు చేశారు. 

పరీక్ష ప్రారంభంలోనే పార్ట్- ఏ, పార్ట్ -బీ పేపర్లను విద్యార్థులకు అందజేయాలని, పార్ట్- బీ పూర్తి చేసిన వెంటనే దానిని మెయిన్ బుక్​లెట్‌‌కు కలిపి కట్టేలా చూడాలన్నారు. దీంతో పాటు క్వశ్చన్ పేపర్, పార్ట్ బీ సీరియల్ నంబర్లను చీఫ్ సూపరింటెండెంట్లు ఫార్మాట్-3లో కచ్చితంగా నమోదు చేయాలన్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత ఆన్సర్ బుక్​లెట్ల ప్యాకింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, రవాణా సమయంలో తడిసిపోకుండా పాలిథిన్ కవర్లను వాడి సురక్షితంగా స్పీడ్ పోస్ట్ చేయాలని డీఈవోలకు సూచించారు.