రంజన్ గొగోయ్ పదవీ విరమణ.. లేవనెత్తిన ప్రశ్నలు

రంజన్ గొగోయ్ పదవీ విరమణ.. లేవనెత్తిన ప్రశ్నలు

వినోదం కోసం గతంలో సర్కస్​లకు వెళ్లేవాళ్లు. ఆ తరువాత సినిమాలు,  యూట్యూబ్​లు  ఇలా  ఎన్నో  వచ్చాయి. వీటన్నింటికన్నా కొంతమంది ప్రవర్తన, వాళ్ల మాటలు వీటన్నింటికి మించి వినోదాన్ని కలిగిస్తున్నాయి. వాళ్లు రాజకీయ నాయకులు కావొచ్చు. సినిమా నటులు కావొచ్చు. చివరికి భారత ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వ్యక్తులు కావొచ్చు. పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తులుగానే సమాజం గుర్తుపెట్టుకుంటుంది. కానీ, వాళ్లే ఆ విషయం మరిచిపోతున్నట్టున్నారు. ఏమైనా వారి ప్రవర్తన వల్ల న్యాయవ్యవస్థ పలుచనైపోయింది. నవ్వులపాలైంది.

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్​ సోమవారం నాడు రాజ్యసభ సభ్యుడిగా తన 6 సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. భారత సుప్రీంకోర్టు నుంచి పదవీ విరమణ చేసిన వెంటనే  రాజ్యసభ సభ్యుడిగా నియమితులైనప్పటి నుంచి ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. 2020 మార్చి 16న అప్పటి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ రాజ్యాంగంలోని ఆర్టికల్​ 80 కింద తనకు ఉన్న అధికారాలను ఉపయోగించి మాజీ ప్రధాన న్యాయమూర్తి  గొగోయ్​ను  రాజ్యసభకు  నామినేట్​ చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 అంటే ఏమిటి?
రాజ్యసభలో ఉండాల్సిన సభ్యుల కూర్పుని ఆర్టికల్​ 80 నిర్దేశిస్తుంది.  ఈ ఆర్టికల్​లోని క్లాజ్​ (3)తో, సబ్​క్లాజ్​ (1)(ఎ)ని చదివితే ఈ కింది రంగాలలో ప్రత్యేక పరిజ్ఞానం లేదా ఆచరణాత్మక అనుభవం ఉన్న 12 మందిని రాజ్యసభకు  నామినేట్​ చేయవచ్చు.  సాహిత్యం, సైన్స్, ఆర్ట్,  సామాజిక సేవలాంటి వాటిని చారిత్రాత్మకంగా ఈ అర్హతలుగా  గుర్తించారు. ఉదాహరణకు 2012లో  అప్పటి రాష్ట్రపతి  ప్రతిభాపాటిల్​ క్రికెటర్​  సచిన్​  టెండూల్కర్​ని  రాజ్యసభకు  నామినేట్​ చేశారు.  రిటైర్డ్  ప్రధాన న్యాయమూర్తి రంజన్​ గొగోయ్​ని  రాజ్యసభ సభ్యునిగా  నియమిస్తూ  జారీ చేసిన  నోటిఫికేషన్​లో  ఆయన  ఏ సేవలు  చేసినందుకు  నామినేట్​ చేశారో  పేర్కొనలేదు.

గొగోయ్​ నేతృత్వం వహించిన ప్రముఖ ధర్మాసనాలు
అయోధ్య వివాదానికి సంబంధించిన కేసుని విచారించిన బెంచ్​కి ఆయన నేతృత్వం వహించారు. నలభై రోజులపాటు  కేసు వాదనలను విన్న ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆ భూమి  టైటిల్​ ‘రామ్​ విరాజ్​మాన్’ భగవంతునికే  చెందుతుందని తీర్పు చెప్పారు.  అంతేకాకుండా  1993 నాటి  అయోధ్య  నిర్దిష్ట ప్రాంత  భూసేకరణ చట్టం ప్రకారం ఆ స్థలంలో  కొత్త ఆలయ నిర్మాణం కోసం ఒక ట్రస్టుని ఏర్పాటు చేయాలని  కేంద్రాన్ని ఆదేశించింది.  మసీద్​ నిర్మాణం కోసం  అయోధ్యలో ఉత్తరప్రదేశ్​ సున్నీ వక్ఫ్​బోర్డుకి కేటాయించాలని  ఆర్టికల్​ 142 ప్రకారం అధికారాలను వినియోగించి ఆ ప్రభుత్వాన్ని ఆదేశించింది.   అస్సాం జాతీయ రిజిస్టర్​ ఆఫ్​ సిటిజెన్స్​ (ఎన్ఆర్​సీ) అమలును  నిశితంగా  పర్యవేక్షించిన  ధర్మాసనానికి రంజన్​ గొగోయ్​ నేతృత్వం వహించారు.  ఆయన  పర్యవేక్షణలోనే  ఎన్ఆర్​సీ రాష్ట్ర  కో ఆర్డినేటర్​ 2019 ఆగస్టు 31న  తుది జాబితాను ప్రచురించారు.

కేంద్రానికి అత్యంత సున్నితమైన రెండు కేసుల్లో ఆయన తీర్పుని ప్రకటించారు. అవి రఫెల్​ యుద్ధ విమానాల ఒప్పందం కేసు,  సీబీఐ వివాదం కేసు.  రఫెల్​ డీల్​లో  సీబీఐ  దర్యాప్తుని  ఆయన నిరాకరించారు. ఈ ఒప్పందం ప్రకారం కేంద్రం ఫ్రెంచ్​ తయారీసంస్థ  దాసాల్ట్ నుంచి 36 యుద్ధ విమానాలను కోనుగోలు చేయాల్సి ఉంది.  సీబీఐ కేసులో దానికి డైరెక్టర్​  అలోక్​వర్మని తిరిగి  నియమించమని  ఆదేశించారు.  ఉన్నతాధికారుల కమిటీ ఆమోదం లేనందున  ఆయన  తొలగింపు ఉత్తర్వు చట్ట విరుద్ధమని  గొగోయ్​ పేర్కొన్నారు.  ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్​ ఖర్గే,  జస్టిస్​ సిక్రేలతో కూడిన కమిటీ  తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆదేశించారు. చివరికి తీర్పు వెలువడిన 48 గంటలలోనే  కమిటీ  డైరెక్టర్​ వర్మను ఆ పదవి నుంచి తొలగించింది.

లైంగిక వేధింపుల ఆరోపణలు
న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యానికి హాని కలిగించే కుట్రలో భాగంగా తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయా లేదా అని నిర్ధారించడానికి ఏర్పాటు చేసిన ధర్మాసనంలో  ఆయన కొద్దికాలంపాటు కూర్చున్నారు.  ఆయన తనని తాను సమర్థించుకున్నారు. ఆ తరువాత వచ్చిన ఉత్తర్వులు మీద ఆయన ఎప్పుడూ సంతకం  చేయలేదు.  తన  హాజరును అధికారికంగా  నమోదు చేయలేదు.  ఇవికాకుండా శబరిమల ఆలయ సమీక్ష పిటీషన్లు, ఎన్నికల బాండ్లు, వీవీ ప్యాట్​లు,  ఆర్టీఐ లాంటి  కేసులని ధర్మాసనాలకి కూడా ఆయన నేతృత్వం వహించారు.

గతంలో రాజ్యసభ సభ్యులైన న్యాయమూర్తులు
గతంలో కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాజ్యసభ సభ్యులు అయ్యారు.  1998లో మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్​ మిశ్రా కూడా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అయితే ఆయన గొగోయ్​ మాదిరిగా ఆర్టికల్ 80 కింద నామినేట్​ చేయలేదు. ఆయన కాంగ్రెస్​ ఎంపీగా ఉండేవారు. 1984  సిక్కు వ్యతిరేక అల్లర్లపై  దర్యాప్తు జరిపిన కమిషన్​కు ఆయన అధ్యక్షత  వహించడం విశేషం. 

కాంగ్రెస్​ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలను దోషులుగా నిర్ధారించినప్పటికీ, కాంగ్రెస్​ పార్టీకి  క్లీన్​చిట్​ను ఇచ్చారు.  గతంలో 1983వ  సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో ఆర్టికల్ 80ని ఉపయోగించి జస్టిస్​ బహ ఈల్​ ఇస్లాంను రాజ్యసభకు  నామినేట్​ చేశారు.  పాట్నా అర్బన్​ కో ఆపరేటివ్​ బ్యాంక్​ కుంభకోణంలో  బిహార్​ ముఖ్యమంత్రి  జగన్నాథ్​ మిశ్రాను నిర్దోషిగా  ప్రకటించడంలో  ఆయన పోషించిన  పాత్రకు  ప్రతిఫలంగా ఇచ్చారని చాలామంది భావించారు.

చరిత్ర ఎలా చూస్తుంది ?
సోమవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ  సమావేశమైనప్పుడు,  రాజ్యసభ  చైర్మన్​ సీపీ రాధాకృష్ణన్ జస్టిస్​ గొగోయ్​కి వీడ్కోలు పలుకుతూ.. ‘ఒక విశిష్ట  న్యాయ కోవిదుడిగా గొగోయ్​ రాజ్యసభ చర్చలకు సాటిలేని న్యాయ పరిజ్ఞానాన్ని అనుభవాన్ని పంచారు. రాజ్యసభలో ఆయన చేసిన ప్రసంగాలు శాసన ప్రక్రియ  ప్రజా ప్రయోజనాలపై ఆయనకున్న లోతైన అవగాహనను  ప్రతిబింబించాయి. ఆయన అందించిన హేతుబద్ధమైన చర్చలకు ఆయన తీసుకువచ్చిన గంభీరతను సభ కచ్చితంగా  కోల్పోతుంది’ అని అన్నారు.

రాజ్యసభలో గొగోయ్​ పాత్ర 
పార్లమెంటరీ  రికార్డుల  ప్రకారం  గొగోయ్​ తన పదవీకాలంలో  రాజ్యసభలో  పరిమితంగా  పాల్గొన్నారు.  ఆయన హాజరు 53 శాతంగా ఉంది. రికార్డుల ప్రకారం తన ఆరేళ్ల పదవీ కాలంలో కేవలం ఒకే ఒక్క చర్చలో మాత్రమే పాల్గొన్నారు.  ఒక్క ప్రశ్న కూడా వేయలేదు.  ఒక్క ప్రైవేట్​ మెంబర్​ బిల్లుని కూడా ఆయన ప్రవేశపెట్టలేదు. స్పెషల్​ మెన్షన్స్​ కూడా సున్నా. కమ్యూనికేషన్,  ఇన్ఫర్మేషన్​ కమిటీలో ఆయన  సభ్యుడు. కానీ, ఒక్క మీటింగ్​కి కూడా హాజరుకాలేదు.  భారతదేశానికి ప్రదాన న్యాయమూర్తి ఒక్కరే ఉంటారు.

రాజ్యసభలో 250 మంది సభ్యులు ఉంటారు. అందులో గొగోయ్​ ఒకరు. ప్రధాన న్యాయమూర్తి  హోదాకి  తగినది కాదు.  కానీ,  రాజ్యసభ సభ్యునికి వచ్చే  వేతనం,  ఇతర భత్యాలు ఎక్కువే.   ఒకే ఒక్క చర్చలో  పాల్గొన్న  గొగోయ్​ని దాని  చైర్మన్​ మర్యాద కోసం  పొగిడినట్టుగా భావించాల్సి ఉంటుంది.  ఎవరేమనుకున్నా ఫర్వాలేదు అనుకుంటే పొరపాటు.  చరిత్ర ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటుంది.  చర్చ వచ్చినప్పుడల్లా ఈ నిర్వాకాన్ని  ప్రశ్నిస్తుంది. ఆయన మనవలు దాన్ని చూడాల్సి వస్తుంది.  ఇలాంటి వ్యక్తులను నామినేట్​ చేసి ప్రజాధనాన్ని వృథా చేయడం ఎందుకు?  గొగోయ్​ పదవీ విరమణ  లేవనెత్తుతున్న ప్రశ్న. ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు కూడా. 

డా. మంగారి రాజేందర్​, జిల్లా జడ్జి (రిటైర్డ్)

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com

* రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.

* రచన 700 పదాలకు మించరాదు.