ఢిల్లీ: ఢిల్లీలో అమానుష ఘటన జరిగింది. భార్య వేధింపులు తట్టుకోలేక యువ జడ్జి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని గ్రీన్ పార్క్‌లో ఉన్న తన ఇంట్లో 30 ఏళ్ల వయసున్న జడ్జి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. బాత్రూమ్‌లో అతని మృతదేహం కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అమన్ కుమార్ శర్మ, ఈశాన్య ఢిల్లీలోని కర్కర్‌డూమా కోర్టులో జిల్లా న్యాయ సేవల అథారిటీ (DLSA) కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఢిల్లీ పోలీసులకు శనివారం మధ్యాహ్నం సుమారు 1.45 గంటలకు సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్ పోలీస్ స్టేషన్‌కు ఒక పీసీఆర్ కాల్ అందింది.
🚨 BREAKING
— Public News X (@PublicNewsX) May 2, 2026
Judge Aman Kumar Sharma (30) dies by suicide
Alleged 2-month harassment by wife and her IAS sister. #Delhi #JudgeSuicide https://t.co/95CfUk1M39 pic.twitter.com/H2H0bk2i8D
అమన్ కుమార్ శర్మ బావ అయిన శివం ఫోన్ చేసి, “మా బావ మరిది ఇంట్లో బాత్రూంలో ఆత్మహత్య చేసుకున్నాడు” అని పోలీసులకు చెప్పాడు. పోలీసులు హుటాహుటిన ఫోన్లో చెప్పిన అడ్రస్కు వెళ్లారు. శర్మ బాత్రూంలో కనిపించడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతను అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఉరి వేసుకోవడం కారణంగా ప్రాణం పోయిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శర్మ ముందు రోజు రాత్రి సుమారు 10 గంటలకు తన తండ్రికి ఫోన్ చేసి.. “నేను చాలా బాధలో ఉన్నాను.. నాకు బతకడం కష్టంగా ఉంది” అని చెప్పుకుని బాధపడ్డాడు.
అల్వార్‌లో ఉన్న తండ్రి వెంటనే ఢిల్లీకి బయలుదేరి అర్ధరాత్రి సమయంలో ఇంటికి చేరుకున్నాడు. గత రెండు నెలలుగా శర్మ తన భార్య వైఖరితో ఇబ్బంది పడుతున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి ప్రకారం.. అతని భార్య కూడా ఒక జ్యుడీషియల్ అధికారి.. ఆమె సోదరి జమ్మూలో పోస్టింగ్లో తీసుకున్న ఒక ఐఏఎస్. ఇంట్లో తనను మానసికంగా వేధిస్తున్నారని.. ఇంట్లో పూర్తి ఆధిపత్యం తన భార్య నిధి మాలిక్‌దే, ప్రతీదీ ఆమె చెప్పినట్లే జరుగుతుందని అమన్ కుమార్ శర్మ తన తండ్రితో చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశాడు. అమన్ తండ్రి.. కోడలి తల్లిదండ్రులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ఆయన నంబర్ను వాళ్లు బ్లాక్ చేశారని అమన్ కుటుంబ సభ్యులు తెలిపారు. అమన్ తండ్రి ఇంటికి వెళ్లిన రోజు కూడా ఇంట్లో గొడవ జరిగింది. భార్యాభర్త మధ్య వాగ్వాదం నడిచింది.
అమన్ శర్మ ఒక గదిలో ఉండగా, అతని భార్య మరో గదిలో ఉంది. ఆమె గట్టిగట్టిగా అరుస్తూ మాట్లాడుతోందని, అమన్ ఏడుస్తున్నాడని అమన్ తండ్రి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ తర్వాత.. శర్మ ఇంట్లో కనిపించలేదు. అతని ఫోన్‌కు డయల్ చేయగా అది బాత్రూమ్ లోపలి నుంచి మోగింది. బాత్రూమ్ లోపల లాక్ చేసి ఉంది. ఆ తర్వాత అద్దం పగలగొట్టి కిటికీ నుంచి లోపలికి వెళ్లి.. డోర్ తెరిచారు. అమన్.. ఒక గుడ్డ ముక్కతో లోపల ఉరి వేసుకుని కనిపించాడు. అమన్ కుమార్ శర్మ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
