- మేలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువే
- హీట్ వేవ్స్ ఉండవ్.. వర్షాలూ పడ్తయ్
- మే నెల ఔట్‌లుక్‌లో ఐఎండీ వెల్లడి
- శనివారం నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీలు
- 12 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, వెలుగు: ఎండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) చల్లటి కబురు చెప్పింది. ఏప్రిల్‌లో 45 డిగ్రీలకు పైగా ఎండలు మండుతుండడంతో మేలో ఇంకెంత తీవ్రత ఉంటుందోనన్న భయాందోళన వెంటాడుతోంది. ఈ తరుణంలో ఎండలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ తెలిపింది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయని మే నెల ఔట్‌లుక్‌లో వెల్లడించింది . రాష్ట్రంలో వడగాడ్పుల ప్రభావం కూడా ఉండదని స్పష్టం చేసింది.
అదే సమయంలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. మేలో పడే సగటు వర్షపాతం కన్నా ఎక్కువ వర్షాలు పడుతాయని తెలిపింది. కాగా, దక్షిణాది జిల్లాల్లో మాత్రం కొంచెం ఎండ ప్రభావం ఉంటుందని, సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యే చాన్స్ ఉందని పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. మే తొలి వారం నుంచే ఈ ఎఫెక్ట్కనిపిస్తుందని వెల్లడించింది.
మళ్లీ మండింది..
శనివారం ఉష్ణోగ్రతలు మరోసారి మండిపోయాయి. సీజన్లో మూడోసారి టెంపరేచర్ 46 డిగ్రీల మార్క్‌ను టచ్ చేసింది. 12 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. మరో 10 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు రికార్డయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్జిల్లా మెండోరాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. నల్గొండ జిల్లా హాలియా, నిర్మల్ జిల్లా ఖానాపూర్, సిద్దిపేట జిల్లా తుక్కాపూర్లలో 45.9, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లలో 45.8, కామారెడ్డి జిల్లా కొల్లూరు, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలలో 45.7, జగిత్యాల జిల్లా రాఘవపేటలో 45.6, సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 45.5, ఖమ్మం జిల్లా రావినూతలలో 45.2, మంచిర్యాల జిల్లా భీమారంలో 45.1 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి.
కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, భువనగిరి, కొత్తగూడెం, ములుగు, హనుమకొండ, మహబూబాబాద్, రాజన్నసిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గాజుల రామారం సర్కిల్ మినహా మిగతా అన్ని సర్కిళ్లలోనూ 42 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యధికంగా యూసుఫ్‌గూడ, చాంద్రాయణగుట్టల్లో 42.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఉప్పల్, ఎల్బీనగర్, సరూర్‌నగర్, మలక్‌పేట, ఫలక్‌నుమ, గోషామహల్, శేరిలింగంపల్లి, బీహెచ్ఈఎల్, బేగంపేటలలో 42.4 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి. కాగా, వచ్చే వారం రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వడగండ్లు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
