ప్లాట్ కొంటున్నారా? జాగ్రత్త! కీసరలో నకిలీ రిజిస్ట్రేషన్ల దందా రట్టు

ప్లాట్ కొంటున్నారా? జాగ్రత్త!  కీసరలో నకిలీ రిజిస్ట్రేషన్ల దందా రట్టు

మల్కాజిగిరి జిల్లాలో   భారీ భూకబ్జా మోసం వెలుగులోకి వచ్చింది. అమాయక ప్రజల ఆస్తులే లక్ష్యంగా సాగుతున్న నకిలీ రిజిస్ట్రేషన్ల దందాను కీసర పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే... కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఖాళీగా ఉన్న ప్లాట్లను టార్గెట్ చేసిన ఒక ముఠా ఏకంగా 1983 నాటి పాత డాక్యుమెంట్లను పోలిన నకిలీ సేల్ డీడ్లను సృష్టించింది. తప్పుడు లింక్ డాక్యుమెంట్లతో పక్కా ప్లాన్ ప్రకారం ఈ భూ దోపిడీకి తెరలేపింది.

అసలు యజమానులకు తెలియకుండానే నకిలీ వ్యక్తులను యజమానులుగా చిత్రించి వరుసగా ఒకరి నుంచి ఒకరికి రిజిస్ట్రేషన్లు చేయించారు. ఈ దందాలో డాక్యుమెంట్ రైటర్లతో పాటు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే ప్లాట్‌ను వేర్వేరు వ్యక్తులకు విక్రయించి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. చివరకు GVR ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పేరుతో అమాయక కొనుగోలుదారులను బురిడీ కొట్టించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు.

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కీసర పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ భారీ స్కామ్‌లో సంబంధం ఉన్న ఆరుగురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం నిందితులు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టే వారు అప్రమత్తంగా ఉండాలని, డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.