IPL 2026: కాటేరమ్మ కొడుకుల జైత్రయాత్రకు బ్రేక్.. SRHపై కేకేఆర్ ఘన విజయం

IPL 2026: కాటేరమ్మ కొడుకుల జైత్రయాత్రకు బ్రేక్.. SRHపై కేకేఆర్ ఘన విజయం

హైదరాబాద్: ఐపీఎల్ 19లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఆదివారం (మే 3) ఉప్పల్ స్డేడియం వేదికగా జరిగిన మ్యాచులో కేకేఆర్ చేతిలో ఎస్ఆర్‎హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచులో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన కేకేఆర్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‎పై ఘన విజయం సాధించింది. టైటిల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో విజయం సాధించి ఫ్లే ఆఫ్స్ ఆశలను కేకేఆర్ సజీవంగా ఉంచుకుంది. 

ఈ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (61), ఇషాన్ కిషన్ (42) రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అరోరా, అంకుల్ రాయ్, గ్రీన్ తలో వికెట్ సాధించారు. సన్ రైజర్స్ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో కేకేఆర్ ఛేధించింది. అంగ్‎క్రిష్ రఘువంశీ (59) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ రహానే (43) ఆకట్టుకున్నాడు. కమిన్స్, సాకీబ్ హోస్సేన్, శివాంగ్ కుమార్ తలో వికెట్ తీశారు.  

సొంతగడ్డపై తడబడ్డ కాటేరమ్మ కొడుకులు:

ఈ మ్యాచులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‎కు దిగిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ భారీ స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. ఫస్ట్ టెన్‎లో అదరగొట్టిన కాటేరమ్మ కొడుకులు ఆ తర్వాత కోల్‎కతా బౌలర్లు విజృంభించడంతో వరుసగా పెవిలియన్‎కు క్యూ కట్టారు. ట్రావిస్ హెడ్ (61), ఇషాన్ కిషన్ (42) మినహా మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ (15), క్లాసెన్ (11), అనికేత్ వర్మ (4), స్మరణ్ (2), కమిన్స్ (10), శివాంగ్ కుమార్ (2), హర్షల్ పటేల్ (6), ఎషాన్ మలింగా (2) వెనువెంటనే ఔటయ్యారు.

పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 71 రన్స్ చేసిన హైదరాబాద్.. ఆ తర్వాత 13 ఓవర్లలో కేవలం 94 పరుగులు మాత్రమే చేసి 9 వికెట్లు సమర్పించుకున్నారు. హెడ్ దూకుడుతో పవర్ ప్లేలో భారీగా పరుగులు సమర్పించుకున్న కేకేఆర్ బౌలర్లు ఆ తర్వాత అనుహ్యంగా పుంజుకుని ఎస్ఆర్‎హెచ్‎ను కట్టడి చేశారు. 

హాఫ్ సెంచరీతో రాణించిన రఘువంశీ

హైదరాబాద్ నిర్ధేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 18.2 ఓవర్లలో ఛేజ్ చేసింది. ఓపెనర్స్ అజింక్య రహానే, ఫిన్ అలెన్ కేకేఆర్‎కు శుభారంభం అందించారు. తొలి వికెట్‎కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వేగంగా ఆడే క్రమంలో ఫిన్ అలెన్ (29) కమిన్స్ బౌలింగ్‎లో ఔట్ అయ్యాడు. ఈ దశలో జతకట్టిన రఘువంశీ (59), అజింక్య రహానే (43) ఇన్నింగ్స్‎ను ముందుకు నడిపించారు. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోవడంతో హైదరాబాద్ బౌలర్లు వికెట్ కోసం శ్రమించారు.

ఎట్టకేలకు 15వ ఓవర్లో సాకీబ్ బౌలింగ్‎లో రహానే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రఘువంశీ కూడా పెవిలియన్ చేరాడు. అప్పటికే మ్యాచ్ హైదరాబాద్ చేజారిపోగా.. గ్రీన్ (3), రింకు సింగ్ (19) మిగితా లాంఛనాన్ని పూర్తి చేసి కేకేఆర్‎ను విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.