- ప్రైవేట్, ఎయిడెడ్ కాలేజీల్లో రూ.500 ఫైన్
హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో చేరాలనుకునే విద్యార్థులకు ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించింది. ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు అడ్మిషన్లు పొందేందుకు గడువు ఇచ్చింది. కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ కాలేజీలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీల్లో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో చేరే విద్యార్థులు ఒక్కో అడ్మిషన్‌కు రూ.500 ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇంటర్ బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించారు.
