- సర్ ముసుగులో 13 కోట్ల ఓట్ల తొలగింపునకు మోదీ కుట్ర
- సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు విజయరాఘవన్
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ఎ. విజయరాఘవన్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామిక హక్కులను, ప్రజల జీవనోపాధిని కాపాడుకోవడానికి విపక్షాలన్నీ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది నిజమైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి అక్రమంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఒక్క ఢిల్లీలోనే 35 శాతం ఓట్లు గల్లంతయ్యాయని, తొలగించిన ఓట్లను తిరిగి నమోదు చేసుకోవడానికి నాలుగైదేండ్లు పడుతుందని.. ఇది పౌరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అన్నారు. ఈసీ ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ధరలు ఆకాశాన్నంటుతుంటే, సామాన్యుల కొనుగోలు శక్తి పడిపోతుంటే.. కేంద్ర ప్రభుత్వం జీడీపీ పెరిగిందని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విజయరాఘవన్ ఎద్దేవా చేశారు.
దేశ సమైక్యతకు తూట్లు పొడుస్తున్నది కేంద్రమే: బీవీ రాఘవులు
దసరా వేళ ప్రధాని మోదీ దేశ సమైక్యతపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని బీవీ రాఘవులు అన్నారు. దేశ సమైక్యతకు అసలైన ముప్పు బీజేపీ విధానాలేనని స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ పేరుతో లోక్‌సభ సీట్లు తగ్గించి శిక్షిస్తారా? అని ప్రశ్నించారు. ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు.
