- సూర్యాపేట జిల్లాలో విషాదం
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురంలో విషాదం చోటుచేసుకుంది. కోతులు వెంటపడటంతో భయంతో పరుగెత్తి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం వల్లాపురం గ్రామానికి చెందిన మోకా వీరబాబు కుమారుడు నిషాంత్ (12), దేశగాని సతీష్ కుమారుడు మణేందర్ (11) మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో గ్రామంలోని చెరువుకు చేపలు పట్టడానికి బయలుదేరారు. అయితే దారిలో ఒక్కసారిగా కోతుల గుంపు వీరిపైకి దూసుకువచ్చి వెంటపడ్డాయి.
దీంతో భయాందోళనకు గురైన ఇద్దరు బాలురు ప్రాణభయంతో పరుగు తీశారు. ఈ క్రమంలో నిషాంత్ కిందపడిపోగా, కొంత దూరంలో రోడ్డుపై పడిపోయిన మణేందర్ గట్టిగా కేకలు వేశాడు. బాలుడి అరుపులకు కోతులు అక్కడి నుండి పారిపోయాయి. అనంతరం మణేందర్ వెనక్కి తిరిగి చూడగా నిషాంత్ స్పృహలేకుండా పడిపోయి ఉన్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న అదే గ్రామానికి చెందిన యువకులు మల్లం నరేందర్, కటికోల కార్తీక్ గమనించి, బాలుడిని తమ బైక్‌పైనే ఖమ్మం వైపు వేగంగా తీసుకెళ్లారు. పెరిక సింగారం బ్రిడ్జి వద్దకు చేరుకోగానే వీరు పిలిపించిన 108 అంబులెన్స్ ఎదురుగా వచ్చింది. వెంటనే బాలుడిని అంబులెన్స్‌లోకి షిఫ్ట్ చేసి పరీక్షించిన సిబ్బంది, నిషాంత్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కూసుమంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
