- 21 దుకాణాల్లో టీజీ సేఫ్ తనిఖీలు
- ఓ స్వీట్‌షాప్ మూసివేత మూడు షాపుల లైసెన్సులు రద్దు
హైదరాబాద్, వెలుగు: పైకి పెద్ద, పెద్ద స్వీట్ షాపులు. అదిరిపోయే ఆంబియన్స్. కానీ కిచెన్ లో మాత్రం బొద్దింకలు, ఎలుకలు తిరుగుతూనే ఉంటాయి. శుక్రవారం హైదరాబాద్ లోని 21 స్వీట్, ఖోవా యూనిట్లపై రైడ్స్చేసిన టీజీ సేఫ్ ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులు అక్కడున్న పరిస్థితులు చూసి విస్తుపోయారు. ఈ దాడుల్లో రూ. 7,75,850 విలువైన 1,035 కిలోల కల్తీ, పాడైపోయిన ఆహార పదార్థాలను సీజ్ చేశారు. తార్నాకలోని సుదర్శన్ రెడ్డి ప్యూర్ ఘీ స్వీట్స్ షాపుకు లైసెన్సే లేదు.
ఎక్స్పైరీ సరుకు, కీటకాలు, తీవ్రమైన అపరిశుభ్రత ఉండటంతో షాపును మూసివేయాలని ఆదేశించారు. కూకట్పల్లి ప్రశాంత్ నగర్‌లోని వాసిరెడ్డి స్వగృహ ఫుడ్స్, మాసబ్ ట్యాంక్ హుమాయున్ నగర్ లోని మధుర్ స్వీట్స్, చందానగర్ లోని బి.బిచ్చారెడ్డి స్వీట్స్ లైసెన్సులను రద్దు చేసి పడేశారు.
బూజు పట్టిన పచ్చళ్లు, కల్తీ నెయ్యి...
కూకట్పల్లి వాసిరెడ్డి స్వగృహ ఫుడ్స్ లో బూజు పట్టిన పచ్చళ్లు, బొద్దింకలు, దుమ్ముపట్టిన ఎగ్జాస్ట్ లు, సిబ్బంది గోళ్లు పెంచుకుని ఆహారం తయారుచేస్తున్న పరిస్థితులు కనిపించాయి. మాసబ్‌ట్యాంక్ మధుర్ స్వీట్స్ లో మిఠాయిలపై దుమ్ము పడకుండా కర్టెన్లు, పాత న్యూస్ పేపర్లు కప్పడం, నాన్ -ఫుడ్ గ్రేడ్ రోజ్ వాటర్ వాడటం వంటివి గుర్తించి, అక్కడ రూ. 5.63 లక్షల విలువైన 705 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
చందానగర్ బిచ్చారెడ్డి స్వీట్స్ లో గోడలపై నాచు, ఎలుకల మల విసర్జన, తుప్పుపట్టిన పరికరాలు, ఎలాంటి లేబుళ్లు లేని కల్తీ నెయ్యి ఉండటంతో రూ. 2.12 లక్షల విలువైన 330 కిలోల నెయ్యిని జప్తు చేశారు. అలాగే, రూల్స్బ్రేక్చేసిన పలు షాపులకు నోటీసులు ఇచ్చారు.
కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్
మేడ్చల్ : అత్యంత అపరిశుభ్రంగా..కుళ్లిన అల్లం, వెల్లుల్లిని తుప్పు పట్టిన గిర్నీలో పేస్ట్పడుతున్న ఓ వ్యక్తిని మేడ్చల్ పోలీసులు, కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ డివిజన్ అత్వెల్లిలో ఓ ఇంట్లో రైడ్స్ చేయగా 8 క్వింటాళ్ల వెల్లుల్లి పేస్ట్, 2 క్వింటాళ్ల కుళ్లిన అల్లం దొరికింది. ఏమాత్రం శుభ్రత లేని చోట ఖరాబైన అల్లం, వెల్లుల్లిని కలిపి తుప్పు పట్టిన గిర్నీలో పడుతూ తక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. దీన్ని ప్యాక్‌చేసి నగరంలోని పలు ప్రాంతాల్లో అమ్ముతున్నట్టు తెలుసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలను దహనం చేసినట్టు వెల్లడించారు.
