సహకార రంగంలో నామినేటెడ్ వ్యవస్థ.. చట్టపరమైన సంక్లిష్టత!

సహకార రంగంలో నామినేటెడ్ వ్యవస్థ.. చట్టపరమైన సంక్లిష్టత!

తెలంగాణలోని  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్​) భవిష్యత్తు నేడు ఒక కీలక మలుపులో నిలిచింది. రాష్ట్ర కేబినెట్ ఏప్రిల్ 23, 2026న తీసుకున్న నిర్ణయం ప్రకారం పదవీకాలం ముగిసిన సుమారు 908 సహకార సంఘాలకు నేరుగా ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పాలక మండళ్లను నియమించాలని ప్రభుత్వం నిశ్చయించింది.  సహకార సంఘాలు ఉమ్మడి జాబితాలో  కాకుండా రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర జాబితా పరిధిలోకి వస్తాయి. కాబట్టి వీటి నిర్వహణపై చట్టాలు చేసే అధికారం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది.

ఈ వెసులుబాటును ఒక సానుకూల అంశంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు మార్చాలని భావిస్తోంది.  అయితే కేవలం రాష్ట్ర చట్టాన్ని మార్చినంత మాత్రాన నామినేటెడ్ వ్యవస్థకు పూర్తిస్థాయి చట్టబద్ధత లభించదు. ఇది 97వ రాజ్యాంగ సవరణ నిబంధనలతో ముడిపడి ఉన్న అంశం కావున రాజ్యాంగ ప్రాథమిక  సూత్రాలను  అధిగమించడం న్యాయపరమైన సవాళ్లకు దారితీస్తుంది.  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ ఆదేశం కావున ఈ కేబినెట్ నిర్ణయాలు చట్టపరమైన సంక్లిష్టతలకు దారితీసే అవకాశం ఉంది.

రాజ్యాంగంలోని  పార్ట్  IXB  సహకార   సంఘాల నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలను  పొందుపరిచింది. ఆర్టికల్ 243ZH  ప్రకారం సహకార సంఘాలు స్వయంప్రతిపత్తి,  ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయాలి. ప్రభుత్వం కేవలం అసెంబ్లీలో చట్టాన్ని సవరించి నామినేటెడ్ పద్ధతిని ప్రవేశపెట్టడం రాజ్యాంగ ఆశయాలకు విరుద్ధంగా భావించవచ్చు.  రాజ్యాంగంలోని  ఒక భాగాన్ని మార్చే అధికారం  పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు.  ఎన్నికల  నిర్వహణ  బాధ్యతను  విస్మరించి  నామినేటెడ్  కమిటీలను  నియమించడం అనేది అసంబద్ధమైన నిర్ణయంగా కనిపిస్తోంది.  

ఇది సంస్థాగత బలోపేతం కంటే తాత్కాలిక రాజకీయ అవసరాలకే  ప్రాధాన్యత  ఇస్తున్నట్లుగా  తోస్తోంది.  ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ ఒక సందర్భంలో పేర్కొన్నట్లు  ‘సహకార సంఘాలు కేవలం అప్పులు ఇచ్చే కేంద్రాలు కావు, అవి సామాజిక మూలధనాన్ని  సృష్టించే వేదికలు’.  ఎన్నికల ప్రక్రియను  పక్కన పెట్టడం వల్ల ఈ సామాజిక మూలధనం క్షీణించే ప్రమాదం ఉంది. 

రాష్ట్ర జాబితాలోని అధికారం అనేది పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే తప్ప రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేయడానికి కాదు.  న్యాయస్థానాలు గతంలో అనేక తీర్పుల్లో  సహకార సంఘాల్లో రాజకీయ జోక్యాన్ని తప్పుపట్టాయి.  కావున ఈ నిర్ణయం చట్టబద్ధంగా నిలవడం సవాలుతో కూడుకున్నది.

అంతర్జాతీయ అవకాశాలు
సహకార  సంఘాలు కేవలం  అప్పులు ఇచ్చే  కేంద్రాలుగా ఉండి ఆధునిక ఇంటిగ్రేటెడ్  ప్యాక్ హౌసెస్గా నిర్మించాలి.  పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో  ఈ వ్యవస్థ  ద్వారా  రైతులు  ద్రాక్ష, ఉల్లి వంటి పంటలను నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.  తెలంగాణలో ఈ ప్యాక్డ్​హౌస్  వ్యవస్థపై  రైతులకు అవగాహన కల్పించాల్సిన  బాధ్యత  ప్రభుత్వంపై ఉంది.  ముఖ్యంగా తెలంగాణ  మామిడికి  అంతర్జాతీయ 
మార్కెట్లో అద్భుతమైన గిరాకీ ఉంది.  జగిత్యాల, ఖమ్మం,  కొల్లాపూర్ ప్రాంతాల్లో  పండే  బంగినపల్లి మామిడిని  ప్యాక్ హౌస్​ల్లో  వేడి నీటి చికిత్స  లేదా  ఇర్రేడియేషన్ పద్ధతుల ద్వారా శుద్ధిచేస్తే  అమెరికా, ఐరోపా దేశాలకు భారీగా ఎగుమతి చేయవచ్చు. 

నాబార్డ్ ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ఫండ్  పథకం కింద సహకార సంఘాలు ప్యాక్ హౌస్​ల ఏర్పాటుకు  రాయితీతో  కూడిన రుణాలు పొందే అవకాశం ఉంది.  బియ్యం, మిరప,  పసుపుతోపాటు మామిడిని కూడా ఈ ప్యాక్ హౌస్​ల ద్వారా గ్రేడింగ్  చేయడం వల్ల  రైతులకు  రెట్టింపు ఆదాయం లభిస్తుంది.  గణాంకాల ప్రకారం  భారతీయ మిర్చి ఎగుమతుల్లో  తెలంగాణ వాటా  పాతిక శాతంగా ఉంది.  ఈ ఎగుమతుల  విలువ ఏటా ఐదు వేల కోట్లకు పైగా చేరుతోంది.  పసుపులో  కర్కుమిన్ శాతం  ఐదు శాతం కంటే ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్యాక్ హౌస్​లు  నాణ్యమైన  ఉత్పత్తులను అందించడంలో  కీలకపాత్ర పోషిస్తాయి.

సహకార రంగంలో సంస్కరణలు
రాజకీయ జోక్యం వల్ల పారదర్శకత లోపించడం,  నిధుల దుర్వినియోగం, వృత్తిపరమైన నిర్వహణ లేకపోవడం వంటివి ప్రధాన అడ్డంకులుగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  ప్యాక్ హౌస్ వంటి మౌలిక సదుపాయాల కల్పనలో మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం గ్రామీణ ఉపాధిని మెరుగుపరుస్తుంది. 

ప్రభుత్వం కేవలం నామినేటెడ్ కమిటీల నియామకంపై చూపే ఆసక్తిని ఆడిటింగ్, జవాబుదారీతనం పెంచడంపై చూపాల్సిన అవసరం ఉంది. రాజకీయ నేతల అనుచరులకు పదవులు పంపిణీ చేసే వేదికలుగా సహకార సంఘాలను మార్చడం వల్ల రైతులకు అందాల్సిన సేవలు నెమ్మదించనున్నాయి. 

డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగడం,  రుణాల పంపిణీలో  వివక్ష చూపే అంశాలు  సహకార  స్ఫూర్తిని దెబ్బతీస్తాయి. గ్రామీణ  ఆర్థికరంగ నిపుణులు సూచించినట్లు  ‘సుస్థిరమైన గ్రామీణాభివృద్ధికి రాజకీయ జోక్యం లేని స్వయంప్రతిపత్తి కలిగిన సహకార సంఘాలే ఆధారం’.  ఈ కీలక  సమస్యలను పరిష్కరించకుండా కేవలం  నామినేటెడ్ వ్యవస్థను తీసుకురావడం వల్ల  సంస్థాగత  ప్రక్షాళన జరగదు.

రాజ్యాంగ స్ఫూర్తి అవసరం 
తెలంగాణలో  సహకార  ప్రజాస్వామ్యం పునరుద్ధరణ  కావాలంటే ఎన్నికల ద్వారా సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచడమే ఏకైక పరిష్కారం అవుతుంది.  నామినేటెడ్ వ్యవస్థ వల్ల  సంఘాల్లో  రాజకీయ ఆధిపత్యం పెరిగి రాజ్యాంగబద్ధమైన స్వయం ప్రతిపత్తి  దెబ్బతినే  పరిస్థితులు తలెత్తుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 43బీ  ప్రకారం సహకార సంఘాల స్వచ్ఛంద  ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహించాలే తప్ప వాటిపై నియంత్రణను పెంచడం  సమర్థనీయం కాదు.

రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోని  చట్టాలను  రాజ్యాంగ స్ఫూర్తికి  అనుగుణంగా మార్చుకోవాలి.  రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పరిమితం చేయకూడదు.  ఎన్నికల వ్యయం లేదా పరిపాలనా సాకులను చూపి ప్రజాస్వామ్య  ప్రక్రియను  నిలిపివేయడం దీర్ఘకాలంలో  వ్యవస్థకు  తీవ్ర నష్టం కలిగిస్తుంది.  కేవలం వృత్తిపరమైన మేనేజ్‌మెంట్,  రాజకీయ రహిత పాలన ఉన్నప్పుడే  సహకార  సంఘాల రైతులకు నిజమైన ఆర్థిక భరోసాను  ఇవ్వగలుగుతాయి.

సుస్థిర గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కోసం కార్యాచరణ రూపొందించాలి
రాబోయే కాలంలో  తెలంగాణ రాష్ట్రం మహారాష్ట్ర తరహాలో ఆధునిక ప్యాక్ హౌస్  సాంకేతికతను భారీగా  అందిపుచ్చుకోవాలి.  దీనివల్ల సహకార సంఘాలు కేవలం అప్పులు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా  రైతుల జీవితాల్లో  వెలుగులు నింపే బలమైన ఆర్థిక ఇంజిన్లుగా రూపాంతరం చెందుతాయి.  రాజ్యాంగ  స్ఫూర్తిని గౌరవించి  సకాలంలో  ఎన్నికలు నిర్వహించడం ద్వారానే పారదర్శకమైన  పాలన సాధ్యం  అవుతుంది. 

భవిష్యత్తులో  మహిళా సంఘాల భాగస్వామ్యం, ప్యాక్ హౌస్​ల  ద్వారా  పంటల విలువ ఆధారిత ఎగుమతులు పెరిగి  తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా మారుతుంది. అపెడా,  నాబార్డ్  ఆర్థిక పథకాలను సంపూర్ణంగా వినియోగించుకోవడం ద్వారా  తెలంగాణ  రైతులు  అంతర్జాతీయ  మార్కెట్​లో అగ్రస్థానంలో నిలుస్తారు. ఈ  మార్పుల వల్ల  గ్రామీణ ప్రాంతాల్లో  సంపద సృష్టి జరిగి  రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయి.

డా. కట్కూరి, పాలసీ విశ్లేషకుడు

 

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ​ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.