సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో హీరోలు శత్రువుల స్థావరాల్లోకి కంటికి కనిపించని సూక్ష్మ పరికరాలను పంపి రహస్యాలన్నీ తెలుసుకోవడం చూసే ఉంటాం కదా.. ఇప్పుడు అలాంటి టెక్నాలజీని చైనా నిజం చేసింది. ఒక చిన్న దోమ సైజులో ఉండే గూఢచారి డ్రోన్‌ను చైనా సైన్యం తయారు చేసింది. శత్రువుల ముక్కు ముందే తిరుగుతున్నా.. అది డ్రోన్ అని కనిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదన్నమాట. చైనాలోని రోబోటిక్స్ ల్యాబ్ సృష్టించిన ఈ క్రేజీ గ్యాడ్జెట్ గురించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం....
అసలు ఎలా ఉంటుంది ఈ 'దోమ' డ్రోన్
చైనా మిలిటరీ టీవీ ఛానెల్ (CCTV 7) ప్రసారం చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం, ఈ మైక్రో-డ్రోన్‌ను నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని డిజైన్ సరిగ్గా మన ఇంట్లో తిరిగే దోమలాగే ఉంటుంది. దీనికి సన్నని శరీరం, రెండు చిన్న రెక్కలు, వెంట్రుకంత సన్నటి మూడు కాళ్లు ఉంటాయి. ఇది ఎంత చిన్నదంటే.. మనం రెండు వేళ్ల మధ్య చాలా ఈజీగా పట్టుకోవచ్చు. పరిశోధకులు దీనితో పాటు స్మార్ట్‌ఫోన్‌తో కంట్రోల్ చేయగల నాలుగు రెక్కల మరో మోడల్‌ను కూడా చూపించారు.
శత్రువుల గుండెల్లో వణుకు
ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసిన స్టూడెంట్ లియాంగ్ హెక్సియాంగ్ చెప్పిన దాని ప్రకారం.. ఈ దోమ రోబోట్‌ను యుద్ధ సమయంలో రహస్య నిఘా కోసం, అత్యంత ప్రమాదకరమైన మిషన్ల కోసం తయారు చేశారు.
సాధారణంగా పెద్ద పెద్ద డ్రోన్‌లను శత్రువుల రాడార్లు లేదా నిఘా కెమెరాలు సులభంగా పసిగట్టేస్తాయి. కానీ, ఈ దోమ డ్రోన్ అంత సున్నితమైన ప్రాంతాల్లోకి కూడా ఎవరికీ అనుమానం రాకుండా చొరబడిపోగలదు. శత్రువుల పక్కనే కూర్చుని అక్కడి రహస్యాలను, దృశ్యాలను లైవ్‌గా తన దేశ ఆర్మీకి పంపించేస్తుంది.
ఇంత చిన్న డ్రోన్ వెనుక ఎంత పెద్ద కష్టముందో
చూడటానికి చిన్న దోమలా ఉన్నా, దీన్ని తయారు చేయడం శాస్త్రవేత్తలకు ఒక పెద్ద సవాల్. ఎందుకంటే, అంత చిన్న బాడీలో కెమెరా సెన్సార్లు, బ్యాటరీ, కంట్రోల్ సర్క్యూట్లు, సిగ్నల్స్ పంపే కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నింటినీ అమర్చాలి. పైగా గాల్లో ఎగిరేటప్పుడు బ్యాలెన్స్ తప్పకుండా, ఒక కీటకంలాగే కదిలేలా చేయడం కోసం మైక్రో-ఇంజనీరింగ్ అండ్ బయోనిక్స్ వంటి ఎన్నో అధునాతన సాంకేతికతలను వాడారు.
మిగతా దేశాలు కూడా
ఇలాంటి సూక్ష్మ డ్రోన్ల తయారీలో చైనా ఒక్కటే లేదు. ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని దేశాలు కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాయి. చైనా దీన్ని మిలిటరీ కోసం తయారు చేసినప్పటికీ, ఇలాంటి మైక్రో-రోబోల వల్ల భవిష్యత్తులో మానవాళికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చివరగా ఈ దోమ సైజు డ్రోన్ల రాకతో భవిష్యత్తులో గూఢచర్యం, యుద్ధాల తీరు పూర్తిగా మారిపోబోతోంది. అయితే, ఇవి ఎవరి వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీయకుండా, ఎలాంటి నైతిక సమస్యలు తీసుకురాకుండా వాడడమే ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్.
