నష్టాల నుంచి లాభాల్లోకి.. దేశంలోనే నెంబర్ వన్ ప్రజా రవాణా వ్యవస్థ TGSRTC

నష్టాల నుంచి లాభాల్లోకి.. దేశంలోనే నెంబర్ వన్ ప్రజా రవాణా వ్యవస్థ TGSRTC

దేశంలోనే ఎక్కడా లేని విధంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా, వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు మంత్రి పొన్నం ప్రభాకర్ . ఒకప్పుడు నష్టాల్లో, ఆపరేషనల్ లాస్‌లో ఉన్న టీజీ ఆర్టీసీ.. ఇప్పుడు లాభాల బాట పట్టిందని, దేశంలోనే నెంబర్ వన్ ప్రజా రవాణా వ్యవస్థగా నిలిచిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకు పైగా ఆర్టీసీ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయని మంత్రి తెలిపారు.

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీ నుండి కరీంనగర్ ఎన్టీఆర్ విగ్రహం వరకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుల్లా ప్రయాణించారు. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులు, మహిళలతో మంత్రులు ఆత్మీయంగా ముచ్చటించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్..ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తాము రోజువారీ ఉపాధి పనులకు వెళ్తూ.. రోజుకు 200 రూపాయల వరకు ఆదా చేసుకుంటున్నామని మహిళలు మంత్రులతో ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే, స్కూళ్లు, కాలేజీల సమయానికి అనుగుణంగా అదనపు బస్సులు నడుపుతున్నందుకు విద్యార్థులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

డిసెంబర్ 3, 2023న ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన ప్రజా పాలన ప్రభుత్వం.. బాధ్యతలు స్వీకరించిన కేవలం 48 గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణ హామీని అమలు చేసిందని మంత్రి గుర్తుచేశారు. ఆర్టీసీలో చాన్నాళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలను పరిష్కరించడమే కాకుండా.. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేసి, సరికొత్త రూట్లలో సర్వీసులు నడుపుతున్నామని చెప్పారు. మహిళలు వైద్యం కోసం హాస్పిటల్స్ కి, ఆధ్యాత్మికత కోసం దేవాలయాలకు ఉచితంగా వెళ్తూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.

ఇక ఆటో కార్మికులు సైతం తమ ఉద్యమకారులేనని.. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జూన్ 21న జరగబోయే నీట్ (NEET) పరీక్ష రాసే విద్యార్థులకు హాల్ టికెట్ చూపిస్తే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని NSUI అధ్యక్షుడు వెంకట్ స్వామి కోరిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. దీనిపై ముఖ్యమంత్రితో మాట్లాడి హాల్ టికెట్ ఉన్న అభ్యర్థులందరికీ ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, ఉపాధి రంగాలే లక్ష్యంగా ప్రజా పాలన ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.