కరీంనగర్: 151 మంది చిన్నారులకు విముక్తి

కరీంనగర్: 151 మంది చిన్నారులకు విముక్తి

కరీంనగర్ టౌన్/జగిత్యాల టౌన్, వెలుగు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోలీసులు, ఇతర శాఖల సహకారంతో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ 12 కార్యక్రమంలో 151మంది చిన్నారులను రెస్క్యూ చేసినట్లు కరీంనగర్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యుసీ) చైర్ పర్సన్ ధనలక్ష్మి తెలిపారు. సిటీలోని బాలరక్ష భవన్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతితో కలిసి పాల్గొని మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని 16 మండలాల్లోని హోటళ్లు, దాబాలు,షాపులు,తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 151 మంది చిన్నారులకు విముక్తి కల్పించినట్లు తెలిపారు. 18ఏండ్ల లోపు చిన్నారులతో పనిచేపించడం చట్టరీత్యా నేరమన్నారు.

63 మంది బాల కార్మికుల రెస్క్యూ

జగిత్యాల జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో 63 మంది బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. సబ్‌‌‌‌‌‌‌‌ డివిజన్ల వారీగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి హోటళ్లు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. పిల్లలతో పనులు చేయిస్తున్న 26 మంది యజమానులపై కేసులు నమోదు చేశామని చెప్పారు.ఎక్కడైనా బాల కార్మికులు, తప్పిపోయిన, పిల్లల సమాచారం తెలిసినా 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు.