- మల్టీజోన్–1లో 63, మల్టీజోన్–2లో 57 మందికి ఛాన్స్
- 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని నిబంధన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఎంపీడీఓ)పోస్టులను భర్తీ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాల్లో సూపర్ వైజర్లు (జడ్పీపీ, ఎంపీపీ), మండల పంచాయతీ అధికారులు (ఎంపీఓ)గా పనిచేస్తున్న 120 మంది అధికారులకు ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పిస్తూ కమిషనర్ డి. దివ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలికమని, ఎలాంటి నోటీసు లేకుండానే తిరిగి పాత పోస్టులకు పంపే అవకాశం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పదోన్నతి పొందిన అధికారులు ఉత్తర్వులు అందిన 15 రోజుల్లోగా తమ పాత పోస్టుల నుంచి రిలీవ్ అయి, కేటాయించిన జిల్లాల్లో రిపోర్ట్ చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఆ వివరాలను వెంటనే కమిషనర్ కార్యాలయానికి పంపాలని జిల్లా పరిషత్ సీఈవోలను, కలెక్టర్లను ఆదేశించారు. గడువులోగా విధుల్లో చేరని పక్షంలో పదోన్నతిని రద్దు చేయడంతోపాటు సీనియారిటీని కూడా కోల్పోతారని హెచ్చరించారు. ఏవైనా క్రమశిక్షణా చర్యలు, ఏసీబీ కేసులు పెండింగ్‌లో ఉన్న అధికారులకు ఈ పదోన్నతులు వర్తించవని, అటువంటి వారిని వెంటనే రిలీవ్ చేయొద్దని కలెక్టర్లకు సూచించారు.
జోన్ల వారీగా వివరాలు
మల్టీజోన్–1 పరిధిలోని వివిధ జిల్లాల నుంచి 63 మంది అధికారులకు ఎంపీడీఓలుగా ఛాన్స్ దక్కింది. వీరికి జగిత్యాల, నిజామాబాద్, హనుమకొండ, కరీంనగర్ వంటి జిల్లాలతోపాటు కమిషనర్ కార్యాలయంలోనూ పోస్టింగ్స్ ఇచ్చారు. మల్టీజోన్–2 పరిధిలో 57 మందికి పదోన్నతులు దక్కాయి. వీరిని వనపర్తి, నల్గొండ, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలకు కేటాయించారు.
