తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సామాజిక, ఆర్థిక, కుల సర్వే ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో గౌడ కులస్థుల జనాభా సుమారు 16 లక్షల పైమాటే. ఇందులో దాదాపు 3 లక్షల మంది గౌడ శ్రామికులు భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం, ఆసిఫాబాద్, మహబూబాబాద్ లాంటి రాష్ట్రవ్యాప్త 85 ఏజెన్సీ మండలాల్లోని అటవీ గ్రామాల పరిధిలో నివసిస్తున్నారు. తరతరాలుగా ఏజెన్సీ ప్రాంతాల్లోనే పుట్టి పెరిగి, గీత వృత్తినే నమ్ముకుని బతుకుతున్న ఈ 3 లక్షల జనాభా ప్రస్తుతం ఒక పరిపాలనా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సాంకేతికత పెరిగి, ప్రభుత్వ పథకాలన్నీ డిజిటల్ మయం అయ్యాక.. ఈ అటవీ ప్రాంత గౌడ కార్మికులు ప్రభుత్వ సంక్షేమానికి పూర్తిగా దూరమై 'డిజిటల్ బహిష్కరణ'కు గురవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా 50 ఏళ్లు నిండినవారికి 'ఆసరా పెన్షన్', ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణిస్తే కుటుంబానికి రూ. 5 లక్షల ధీమా ఇచ్చే 'గీత కార్మిక బీమా', ప్రాణ రక్షణ కోసం 'సేఫ్టీ మోకులు' పంపిణీ చేసే పథకాలను అమలు చేస్తోంది. అయితే, ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్‌లో ఒక నిబంధన పెట్టారు. అదేమిటంటే.. దరఖాస్తుదారునికి తప్పనిసరిగా ‘కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం (టీసీఎస్)’ సభ్యత్వం లేదా ఎక్సైజ్ శాఖ గుర్తింపు కార్డు ఉండాలి. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని అటవీ భూములు, సహజ వనరులపై గిరి జనులకు మాత్రమే హక్కులు కల్పిస్తూ 'పెసా (పీఈఎస్ఏ) చట్టం', ఎల్టీఆర్ (1/70) నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ చట్టాల పరిధిని సాకుగా చూపుతూ.. సహకార, ఎక్సైజ్ శాఖలు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులైన గౌడ కులస్థులకు కొత్త కల్లు గీత సంఘాల (టీసీఎస్) రిజి స్ట్రేషన్లను, పాత సొసైటీల పునరుద్ధరణలను (రెన్యువల్స్) పూర్తిగా నిలిపివేశాయి.
కార్యాలయాల చుట్టూ తిరిగినా తిరస్కరణే!
సొసైటీలు లేకపోవడంతో గీత కార్మికులకు 'సొసైటీ ఐడీ కార్డు' లభించడం లేదు. దీనివల్ల, వారు ఆసరా పెన్షన్ కోసమో, బీమా కోసమో మీ-సేవ కేంద్రాలకో లేదా ప్రభుత్వ కార్యాలయాలకో వెళ్లినప్పుడు.. ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ఆ ఐడీ నంబర్ లేనిదే అప్లికేషన్‌ను స్వీకరించడం లేదు. క్షేత్రస్థాయిలోని మండల రెవెన్యూ అధికారులు (ఎమ్మార్వో), ఎక్సైజ్ అధికారులు ఈ సమస్యను చూసి సానుభూతి ప్రకటిస్తున్నారే తప్ప పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ‘సిస్టమ్ ఒప్పుకోవడం లేదు, ప్రత్యామ్నాయ పత్రాలు స్వీకరించే జీఓ మాకు లేదు’ అంటూ దరఖాస్తులను నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు. ఇది ములుగు జిల్లా మంగపేట మండలంలోని కొన్ని గ్రామాల సమస్య మాత్రమే కాదు, ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలోని మొత్తం 85 ఏజెన్సీ మండలాల ఉమ్మడి ఆర్తనాదం.
రాజ్యాంగ ఉల్లంఘన కాదా?
రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో ఉన్న గీత కార్మికులందరికీ పెన్షన్లు, బీమాలు వర్తిస్తూ.. కేవలం భౌగోళికంగా ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నారనే ఒకే ఒక్క కారణంతో సంప్రదాయ వృత్తిదారులకు ఈ హక్కులను నిరాకరించడం రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కుకు (ఆర్టికల్ 14) పూర్తి విరుద్ధం. అంతకంటే ముఖ్యంగా ప్రమాదకరమైన వృత్తిలో ఉంటూ, కనీస రక్షణ సాధనమైన 'సేఫ్టీ మోకు'ను కూడా పొందలేకపోవడం వల్ల అనేకమంది కార్మికులు తాటి చెట్లపైనుంచి పడి ప్రాణాలు కోల్పోతున్నారు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇది నేరుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన 'జీవించే హక్కు'ను కాలరాయడమే అవుతుంది. గిరిజన చట్టాలను రక్షించాలనే ప్రభుత్వ ఉద్దేశం సరైనదే కావచ్చు. కానీ, ఆ చట్టాల మితిమీరిన పరిపాలనా అన్వయం ఒక సంప్రదాయ వెనుకబడిన కులాన్ని ఆకలిపాలు చేయకూడదు.
ప్రభుత్వం ఏం చేయాలి?
ఏజెన్సీ ప్రాంతాల గీత కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యామ్నాయ నిబంధనను తీసుకురావాలి. సంక్షేమ పథకాలకు సొసైటీ ఐడీ కార్డుతో సంబంధం లేకుండా.. స్థానిక కుల ధ్రువీకరణ పత్రం (కేస్ట్ సర్టిఫికెట్), వ్యక్తిగత గీత లైసెన్స్ (టీఎఫ్‌టీ) లేదా ఎక్సైజ్ అధికారుల ప్రత్యక్ష క్షేత్రస్థాయి పరిశీలన నివేదిక ఆధారంగా అప్లికేషన్లను ఆమోదించేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా వైన్ షాపుల కేటాయింపుల్లో గౌడులకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం, అదే గౌడ కులంలో అత్యంత వెనుకబడి, ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసముంటున్న ఈ 3 లక్షల మంది పేద కార్మికుల కడుపు నింపే ఆసరా పెన్షన్లను, ప్రాణ రక్షణ బీమాలను ఎందుకు అంధకారంలో నెట్టేసిందో ఆలోచించాలి. ఇప్పటికైనా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీ గౌడుల 'డిజిటల్ లాకౌట్' సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం.
- శ్రవణ్ గౌడ్ గాజుల
ఉస్మానియా వర్సిటీ
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
