బొకే వద్దన్న సీఎం విజయ్.. ఆ డబ్బుతో ముగ్గురు బాలికల భవిష్యత్తుకు విశాల్ భరోసా

బొకే వద్దన్న సీఎం విజయ్.. ఆ డబ్బుతో ముగ్గురు బాలికల భవిష్యత్తుకు విశాల్ భరోసా

తమిళనాడు సీఎం విజయ్‌ను హీరో విశాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నటుడు విశాల్ చేసిన పని ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటోంది. సీఎంను కలిసేందుకు తీసుకెళ్లిన బొకే, శాలువాను విజయ్ స్వీకరించకపోవడంతో, వాటి కోసం ఖర్చు చేయాల్సిన డబ్బును మంచి పనికి వినియోగించాలని విశాల్ నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం విజయ్ పేరు మీద తమిళనాడుకు చెందిన ముగ్గురు నిరుపేద విద్యార్థినుల ఉన్నత చదువులకు స్పాన్సర్‌షిప్ అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని విశాల్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా పంచుకున్నారు. సీఎంతో జరిగిన భేటీ ఎంతో ఆత్మీయంగా సాగిందని, బొకే కంటే ఒక చిన్నారి విద్యకు సహాయం చేయడం సమాజంపై శాశ్వత ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

ఎన్నో విమర్శలు, సవాళ్లను మౌనంగా ఎదుర్కొంటూ విజయ్ విజయాన్ని సాధించారని కొనియాడారు. ముఖ్యమంత్రి పదవి వచ్చినా విజయ్‌ వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదని విశాల్‌ వెల్లడించారు. కాగా విశాల్ ఎంపిక చేసిన ముగ్గురు విద్యార్థినులు తమ కుటుంబాల్లో తొలి గ్రాడ్యుయేట్లు కావడం విశేషం. వారిలో ఒకరు బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్), మరొకరు బీసీఏ, ఇంకొకరు బీకామ్ చదువుతున్నారు.

విశాల్ స్పెషల్ నోట్ ద్వారా స్పందిస్తూ..‘‘మన రాష్ట్ర ముఖ్యమంత్రిని 'డార్లింగ్' అని పిలవడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. నాలోని అభిమానిని ఎప్పటికీ అలాగే ఉంటాడు" అని రాశారు. బొకే, శాలువా తీసుకోకుండా విజయ్ చేసిన వినయపూర్వక నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ డబ్బుతో తమిళనాడుకు చెందిన ముగ్గురు అర్హత కలిగిన పేద బాలికల విద్యాభ్యాసానికి సహాయం చేశానని తెలిపారు. ఈ ముగ్గురు తమ కుటుంబాల్లో తొలి గ్రాడ్యుయేట్లు కావడం విశేషమని, వారు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని‌‌‌ వెల్లడించారు. భవిష్యత్తులో వారు ఈ సహాయాన్ని, విజయ్ పేరును గర్వంగా గుర్తుంచుకుంటారని‌‌‌’ విశాల్ పేర్కొన్నారు.

చివరగా మరోసారి ముఖ్యమంత్రి విజయ్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్.. ఆయన పదవీకాలంలో తమిళనాడు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ‘తమిళనాడుకు అత్యుత్తమ రోజులు రావాలని ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు. ఇకపోతే, విజయ్ కేబినెట్‌లో సినిమాటోగ్రఫీ శాఖ కేటాయింపుపై విమర్శలు చేసిన విశాల్.. ఇప్పుడు సీఎంను కలిసి అభినందించడం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మకుటుంతో థియేటర్లోకి విశాల్..

ప్రస్తుతం విశాల్ నటుడిగానే కాదు.. డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు చేపట్టి డబుల్ ధమాకా ఇవ్వడానికి రెడీ అయ్యారు. విశాల్ హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మకుటం’. ఇటీవలే ఈ మూవీ టీజర్ రిలీజై కుంటుంది. ఈ సినిమాలో విశాల్ ఏకంగా మూడు వైవిధ్యమైన పాత్రల్లో మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న గెటప్స్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలైలో గ్రాండ్‌గా విడుదల కానుంది.