వెలుగు ఓపెన్ పేజీ.. ఇంకుడు గుంత ఇంటికి రక్ష

వెలుగు ఓపెన్ పేజీ.. ఇంకుడు గుంత ఇంటికి రక్ష

తెలంగాణ రాష్ట్రం గత కొన్నేళ్లుగా వర్షాల పరంగా కొంత అనుకూల పరిస్థితిని చూసినప్పటికీ, ఈ సంవత్సరం పరిస్థితి అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. వాతావరణ నిపుణులు, వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ ఏడాది ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో  ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.  సాధారణంగా ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావం పెరిగితే  వర్షపాతం తగ్గిపోవడం,  ఎండలు అధికమవడం, భూగర్భ జలాలు క్షీణించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. 

దేశవ్యాప్తంగా సాధారణ  వర్షపాతంతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షపాతం తగ్గే అవకాశముందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కూడా సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటోంది.  ఇలాంటి  పరిస్థితుల్లో ప్రతి ఇంటికి  ‘ఇంకుడు గుంత’ ఒక రక్షక కవచంలా మారుతుంది.  వర్షపు నీరు వృథా కాకుండా భూమికి చేరితే భవిష్యత్తు తరాలకు నీటి భద్రత అనే ఆలోచనతో ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మాణం అత్యవసరంగా మారింది.

తెలంగాణలో  వేసవి  ప్రారంభమైనప్పటి నుంచే చాలా పట్టణాల్లో బోర్లు ఎండిపోవడం,  ట్యాంకర్లపై ఆధారపడటం, తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడటం సాధారణమైపోయింది. ఒకప్పుడు 150–200 అడుగుల లోతులో దొరికిన నీరు ఇప్పుడు 500–800 అడుగులకు పడిపోవడం ఆందోళన కలిగించే విషయం.  వర్షాలు తగ్గితే ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతుంది.  మున్సిపాలిటీలు కూడా నీటి సరఫరా కోసం కోట్ల రూపాయలు ట్యాంకర్లకు ఖర్చు చేస్తున్నాయి.  

ఒక మధ్య తరహా పట్టణంలో వేసవికాలంలో ట్యాంకర్ల నిర్వహణకే ఏటా రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.  ఈ  భారాన్ని తగ్గించే సులభ మార్గం వర్షపు నీటి సంరక్షణే.   ఒక 200 గజాల ఇంటి  పైకప్పు విస్తీర్ణం సుమారు 180–200 చదరపు మీటర్ల వరకు ఉంటుంది.  తెలంగాణలో సంవత్సరానికి సగటు వర్షపాతం సుమారు 850–900 మిల్లీమీటర్లుగా  పరిగణిస్తే,  ఒక ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటిలో కనీసం 1.5 లక్షల నుంచి 2 లక్షల లీటర్ల వరకు నీటిని సేకరించి భూమిలోకి  ఇంకించవచ్చు.  అంటే  ఒక  కుటుంబానికి ఏడాది పొడవునా అవసరమయ్యే నీటి అవసరంలో గణనీయమైన భాగాన్ని ఆదా చేసినట్లే.  ఇది కేవలం నీటి పొదుపు మాత్రమే కాదు.  భూగర్భ జలాలకు భవిష్యత్తు భద్రత.

బోరు బావులు ఎలా రీచార్జ్ అవుతాయి?

వర్షపు నీరు రోడ్లపై పారిపోతే అది నదుల్లో కలిసిపోతుంది.  కానీ ఇంకుడు గుంత ద్వారా ఆ నీరు నెమ్మదిగా నేలలోకి జొరబడుతుంది.  ఈ నీరు భూగర్భ జల పొరలను నింపి,  సమీపంలోని బోరు బావులకు మళ్లీ జీవం పోస్తుంది. అందుకే  ఎండిపోయిన బోర్లు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాల తర్వాత తిరిగి నీరు ఇవ్వడం చూస్తుంటాం.  ఒక ప్రాంతంలో ఎక్కువ ఇళ్లకు ఇంకుడు గుంతలు ఉంటే, అక్కడ భూగర్భ జల మట్టం క్రమంగా పెరుగుతుంది.  దీంతో బోర్లు తక్కువ లోతులోనే నీరు ఇస్తాయి.  విద్యుత్  వినియోగం తగ్గుతుంది.  మోటార్ల ఖర్చు తగ్గుతుంది.  

రైతులకు, పట్టణ ప్రజలకు నీటి భద్రత పెరుగుతుంది.  ఇంకుడు  గుంతలు  కేవలం  నీటి నిల్వ పద్ధతి కాదు.  ఇది పర్యావరణ రక్షణ ఉద్యమం.  భూగర్భ జలాలు పెరిగితే చెట్లు పచ్చగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు  కొంత తగ్గుతాయి.  నేల తేమ పెరుగుతుంది.  భవిష్యత్తులో  కరువు  ప్రభావం తగ్గుతుంది.   ‘ఒక ఇంటికి ఒక ఇంకుడు గుంత’ అనే ఉద్యమం తెలంగాణలో ప్రతి కుటుంబం ఆచరిస్తే,  రేపటి  నీటి సంక్షోభానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే నిజంగా  ‘ఇంకుడు గుంత ఇంటికి రక్ష.. భవిష్యత్తుకు భరోసా’.

50 వేల జనాభా ఉన్న పట్టణంలో ఎంత నీరు భూమిలోకి?

ఒక పట్టణంలో 50 వేల జనాభా ఉందని అనుకుంటే  సగటున 12–15 వేల ఇళ్లు ఉంటాయి.  ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండి  సంవత్సరానికి కనీసం 1.5 లక్షల లీటర్ల నీరు భూమిలోకి ఇంకితే,  మొత్తం 180 నుంచి 225 కోట్ల లీటర్ల నీరు,  అంటే సుమారు 0.06 నుంచి 0.08 టీఎంసీల నీరు భూగర్భంలోకి చేరే అవకాశం ఉంటుంది.  ఇది చిన్న చెరువు నిండినంత విలువైన నీటి నిల్వ.  చాలామంది  ఇంకుడు గుంత అంటే భారీ ఖర్చు అనుకుంటారు. కానీ ఇంటి వద్ద 3 నుంచి 5 అడుగుల వెడల్పు, 6 నుంచి 8 అడుగుల లోతుతో ఒక సాధారణ ఇంకుడు గుంత నిర్మించడానికి సుమారు రూ.10,000 నుంచి రూ.25,000 మధ్య ఖర్చు అవుతుంది.  రాళ్లు,  ఇసుక,  జెల్లీతో  ఫిల్టర్ పొరలు ఏర్పాటు చేస్తే మరింత మెరుగైన ఫలితం వస్తుంది. ఇది ఒకసారి పెట్టే పెట్టుబడి. కానీ ప్రయోజనం తరతరాలకు ఉంటుంది.

- మనోహర్ దురిశెట్టి, రిటైర్డ్ ఏడీఈ
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు
.