ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ.. ఆగస్ట్ 25కు వాయిదా

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణ.. ఆగస్ట్ 25కు వాయిదా

హైదరాబాద్: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. విచారణ నిమిత్తం ఏసీబీ కోర్టుకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు ఆగస్ట్ 25కు కేసును వాయిదా వేసింది.

రూ.1 లక్ష పూచీకత్తు, ఇద్దరు షూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. ట్రయల్ ప్రారంభ దశలో నిందితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ ఫైనల్ ఛార్జీషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

తొలి సారిగా ఫార్ములా ఈ కార్ రేస్లో నాంపల్లి కోర్టులో కేటీఆర్ విచారణకు హాజరు కావడం గమనార్హం. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ A1గా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనేది ప్రధాన ఆరోపణ.

కేబినెట్ అనుమతి లేకుండానే రూ.55 కోట్ల ప్రభుత్వ నిధులను యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్​ఈఓ) సంస్థకు బదిలీ చేశారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌తో పాటు మిగిలిన నిందితులకు నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు మే 14న సమన్లు జారీ చేసింది. జూలై 31న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

కోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. ట్రయల్‌లో ఇది తొలి విచారణ కావడంతో.. నిందితులంతా తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉండటంతో కేటీఆర్ ఏసీబీ కోర్టుకు హాజరు కావడం గమనార్హం.