లగేజి బుకింగ్ కోసం రైల్వే శాఖ కొత్త రూల్ తీసుకొచ్చింది. టికెట్ బుకింగ్ సమయంలోనే లగేజి బుక్ చేసుకునే అవకాశం కల్పించింది రైల్వే శాఖ. ఆన్ లైన్లో టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే లగేజి కూడా బుక్ చేసుకునేందుకు వీలుగా ఈ విధానం తీసుకొచ్చింది రైల్వే శాఖ. శుక్రవారం ( జులై 31 ) నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది.
మాములుగా అయితే.. ఎక్కువ లగేజి తీసుకెళ్లాల్సి వస్తే.. ముందుగా రైల్వే అధికారులకు వివరాలు అందించాలి. లగేజి బుకింగ్ ఆఫీసుకు వెళ్లి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పరిమితికి మించిన లగేజి తీసుకెళ్తే జరిమానా కూడా విధించే అవకాశం ఉంది కాబట్టి ముందుగా స్టేషన్ కు వెళ్లి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతున్న క్రమంలో ఆన్ లైన్లోనే లగేజి కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది రైల్వే శాఖ.
ఇవాళ్టి నుంచి IRCTCలో టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే లగేజి కూడా బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీల్లో పరిమితికి మించి లగేజి అనుమతించరు. టికెట్ బుకింగ్ తో పాటు లగేజి బుక్ చేసుకోవడం వల్ల చాలా సమయం కలిసొస్తుందని అంటున్నారు ప్రయాణికులు.
తరగతి వారీగా ఉచిత లగేజీ పరిమితి ఇలా:
ఫస్ట్ ఏసీ: 70 కేజీల వరకు ఉచితం. అదనపు చార్జీలు చెల్లిస్తే 150 కేజీలు వరకు అనుమతిస్తారు.
ఫస్ట్ క్లాస్, ఏసీ 2-టైర్: 50 కేజీల వరకు ఉచితం. అదనపు చార్జీలు చెల్లిస్తే 100 కేజీల వరకు అనుమతిస్తారు.
స్లీపర్ క్లాస్: 40 కేజీల వరకు ఉచితం. అదనపు చార్జీలతో 80 కేజీలు అనుమతిస్తారు.
సెకండ్ క్లాస్: 35 కిలోల వరకు ఉచితం. అదనపు చార్జీలతో 70 కిలోల వరకు అనుమతిస్తారు.
ఏసీ 3-టైర్, ఏసీ 3 ఎకానమీ, ఏసీ చైర్ కార్: ఈ బోగీల్లో లగేజీ 40 కిలోల వరకు ఉచితంగా అనుమతిస్తారు. అదనపు లగేజి తీసుకెళ్లే అవకాశం లేదు.
