న్యూఢిల్లీ: వన్డే ట్రై సిరీస్‌లో భాగంగా ఇండియా, శ్రీలంక ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచులో తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ప్లేయర్లు గ్రౌండ్లో పరస్పరం గొడవ పడ్డారు. ఘర్షణ ముదరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వైభవ్ సహనం కోల్పోయి శ్రీలంక ఆటగాడిని తోసేశాడు. ఇతర ప్లేయర్లు కలగజేసుకోవడంతో చివరకు గొడవ సద్దుమణిగింది. అయితే, శ్రీలంక ప్లేయర్‌ను వైభవ్ తోసేయడం వివాదస్పదంగా మారింది.
ఆట అన్నాక మాట మాట అనుకోవడం కామన్.. కానీ ప్రత్యర్థి జట్టు ఆటగాడిపై భౌతికంగా దాడి చేయడం క్రికెట్ ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. ఈ నేపథ్యంలోనే వైభవ్‌పై బీసీసీఐ, ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో గ్రౌండ్లో కంట్రోల్ తప్పిన వైభవ్‌పై చర్యల అంశంపై ఎట్టకేలకు బీసీసీఐ స్పందించింది.
వైభవ్‌పై నో యాక్షన్: దేవజిత్ సైకియా
శ్రీలంక ఆటగాళ్లతో సూర్యవంశీకి జరిగిన తీవ్ర వాగ్వాదానికి గాను బీసీసీఐ అతడిని మందలించవచ్చనే ఊహాగానాలను బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఖండించారు. వైభవ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం మా ఆటగాళ్లు టోర్నమెంట్‌పైనే దృష్టి పెట్టారని.. ఇతర విషయాల వల్ల వారి దృష్టి మరలకూడదని అన్నారు. ట్రై సిరీస్‌లో అంచనాల మేర రాణించలేకపోతున్న బుడ్డోడి ఫామ్‌పైన సైకియా విశ్వాసం వ్యక్తం చేశారు.
వైభవ్ ఐపీఎల్ ఫామ్‌ను ట్రై-సిరీస్‌లోనూ కొనసాగిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. కాగా, శ్రీలంక, ఆప్ఘానిస్తాన్, ఇండియా మధ్య శ్రీలంక వేదికగా ముక్కోణపు వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌కు ఎంపికైన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడి 14, 44, 21 పరుగులు మాత్రమే చేసి అంచనాల మేర రాణించడంలో విఫలమయ్యాడు.
►ALSO READ | ఇది ఐపీఎల్ కాదు బిడ్డా.. ఇంటికి పో.. వైభవ్‌ను రెచ్చగొట్టిన శ్రీలంక ప్లేయర్లు.. ఆ తర్వాతే రచ్చ రచ్చ!
