హైడ్రా ఆఫీసర్లపై హైకోర్టు ఫైర్

హైడ్రా ఆఫీసర్లపై హైకోర్టు ఫైర్
  • హైడ్రా ఆఫీసర్లు సూపర్‌‌ కాప్స్‌‌ కాదు
  • యంత్రాంగంలో భాగమే
  • కోర్టుకు అడ్వకేట్‌‌ హామీ ఇస్తే.. అది హైడ్రా ఇచ్చినట్లే..

హైదరాబాద్, వెలుగు: కోర్టులో ప్రభుత్వ శాఖల తరఫు న్యాయవాదులు ఇచ్చిన హామీని అధికారులు ఇచ్చిన హామీగానే పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అధికారుల చర్యలు ఆ హామీకి భిన్నంగా ఉంటే అది కచ్చితంగా కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. అడ్వకేట్‌‌ జనరల్, అదనపు అడ్వకేట్‌‌ జనరల్, స్టాండింగ్‌‌ కౌన్సిళ్లు, ప్రభుత్వ న్యాయవాదులు ఎవరైనా.. ప్రభుత్వ అధికారులు కోర్టు ఉత్తర్వులను పాటిస్తారని హామీ ఇస్తే అది అన్ని శాఖలకు వర్తిస్తుందని తేల్చి చెప్పింది.

ఈ విధంగా ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తే అధికారులదే బాధ్యత అవుతుందని స్పష్టం చేసింది. హైడ్రాపై నమోదైన ఒక కేసులో జస్టిస్‌‌ జూకంటి అనిల్‌‌ కుమార్‌‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రైవేట్ ఆస్తి విషయంలో జోక్యం చేసుకోబోమని ప్రభుత్వ న్యాయవాది హామీ ఇచ్చినా హైడ్రా జోక్యం చేసుకోవడం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనన్నారు. హైడ్రా అన్ని శాఖల కంటే భిన్నమైనది కాదని, తాము ప్రత్యేకమని హైడ్రా అధికారులు భావిస్తున్నట్లుందని తప్పుపట్టారు. వారు ప్రభుత్వ యంత్రాంగంలో భాగమేనని గుర్తుచేశారు.

హైడ్రా ఆఫీసర్లు సూపర్‌‌ కాప్స్‌‌ కాదని, చట్టపరిధిలోనే పని చేయాలని తేల్చి చెప్పారు. కోర్టుకు ఇచ్చిన హామీకి భిన్నంగా హైడ్రా అధికారులు వ్యవహరిస్తున్నారని శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ వేసిన రెండు కోర్టు ధిక్కార పిటిషన్లను అనిల్‌‌ కుమార్‌‌ విచారించారు. ప్రభుత్వ పిటిషన్లను కొట్టివేస్తూ సివిల్‌‌ కోర్టు, హైకోర్టు ఉత్తర్వులు జారీ చేశాయని, అది ప్రైవేట్‌‌ ఆస్తి అని కోర్టులు ధ్రువీకరించినా ప్రభుత్వ ఆస్తి అంటూ హైడ్రా జోక్యం చేసుకోవడం దారుణమని పిటిషనర్‌‌ న్యాయవాది వాదించారు.

దీనిపై హైడ్రా న్యాయవాది ప్రతివాదన చేస్తూ, ‘సొసైటీ టు సేవ్‌‌ రాక్స్‌‌’ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఉపాధ్యక్షుడు హైడ్రాకు రాసిన లేఖ నేపథ్యంలో సిబ్బంది ఆ ప్రాంతాన్ని సందర్శించారని వివరణ ఇచ్చారు. దీనిపై రికార్డులను పరిశీలించి.. ‘సొసైటీ టు సేవ్‌‌ రాక్స్‌‌’ సంస్థ రాసిన లేఖ ఆధారంగా పిటిషనర్‌‌ ప్రైవేట్‌‌ ఆస్తి వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు హైడ్రాకు లేదని కోర్టు తేల్చి చెప్పింది. హైడ్రా అధికారులు పొరపాటు చేశారని ఆక్షేపించింది. ఇకపై పిటిషనర్‌‌ ఆస్తి వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని హైడ్రా న్యాయవాది ఇచ్చిన హామీని పరిగణనలోకి తీసుకుని కోర్టు ధిక్కరణ పిటిషన్లపై విచారణను క్లోజ్‌‌ చేస్తున్నట్లు ప్రకటించింది