స్పేస్ఎక్స్ IPO ధమకా: రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిన వేల మంది ఉద్యోగులు

స్పేస్ఎక్స్ IPO ధమకా: రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిన వేల మంది ఉద్యోగులు

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కార్పొరేట్ చరిత్రలో కనీవిని ఎరుగని భారీ సంపద సృష్టికి తెరలేపింది. అందరూ మస్క్ ఆస్తుల గురించే మాట్లాడుకుంటున్నారు కానీ.. అసలు సిసలైన మ్యాజిక్ ఆ కంపెనీ ఉద్యోగుల జీవితాల్లో జరిగింది. సాధారణ స్టార్టప్‌గా మొదలై మల్టీ-ట్రిలియన్ డాలర్ల దిగ్గజంగా ఎదిగే వరకు కంపెనీని నమ్ముకున్న ఇంజనీర్లు, టెక్నీషియన్లు, కాంట్రాక్టర్లు ఈ ఐపీఓ పుణ్యమా అని రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు.

నాస్‌డాక్ స్టాక్ మార్కెట్లో స్పేస్ఎక్స్ షేరు ధర రూ.12వేల 825 వద్ద లిస్ట్ అయింది. దీనితో కంపెనీ ప్రారంభ విలువ సుమారు రూ.168 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ ఏకంగా రూ.7.12 లక్షల కోట్ల ($75 బిలియన్) నిధులను సేకరించింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ స్పేస్ దిగ్గజం మార్కెట్ క్యాప్ రూ.190 లక్షల కోట్ల మార్కును దాటేసి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల్లో ఒకటిగా నిలిచింది.

స్పేస్ఎక్స్‌లో పనిచేస్తున్న, పని చేసి మానేసిన సుమారు 4వేల 400 మందికి పైగా ఉద్యోగుల చేతిలో ఒక్కొక్కరికి ఇప్పుడు కనీసం రూ.9.5 కోట్లు విలువైన స్టాక్స్ ఉన్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. దాదాపు 400 మంది ఉద్యోగుల వాటా విలువ ఒక్కొక్కరికి రూ.950 కోట్లు పైనే ఉంటుంది. ఒకే ఒక్క ఐపీఓ ఇంత పెద్ద సంఖ్యలో సాధారణ ఉద్యోగులను అపర కుబేరులను చేయడం సోషల్ మీడియాలో క్రేజీ టాపిక్‌గా మారింది.

ఇందుకు ఉదాహరణే ట్రెవర్ హైస్ అనే ఉద్యోగి. ఈయన 2011లో జనరల్ ఎలక్ట్రిక్ ఆఫర్‌ను వదులుకుని మరీ స్పేస్ఎక్స్‌లో చేరాడు. 12 ఏళ్ల సర్వీసులో ఆయన సంపాదించిన లక్ష షేర్ల విలువ ఇప్పుడు రూ.128 కోట్లకు చేరింది. అలాగే 2015లో కేవలం గంటకు రూ.2,660 చొప్పున జీతానికి చేరిన జువాన్ హెర్నాండెజ్ అనే కాంట్రాక్ట్ వెల్డర్ స్టాక్ హోల్డింగ్స్ విలువ ఇప్పుడు ఏకంగా రూ.8.5 కోట్లకు చేరింది. మాజీ లాంచ్ ఇంజనీర్ గావిన్ పెటిట్ కూడా వేలాది షేర్లతో భారీ లాభాలను అందుకున్నాడు.

సాధారణ కంపెనీలలా కాకుండా.. స్పేస్ఎక్స్ మొదటి నుండి తన ఉద్యోగులకు జీతాలతో పాటు స్టాక్ ఆప్షన్స్ భారీగా ఇచ్చింది. కంపెనీ విలువ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, ఆపరేషన్స్ విభాగాల్లోని సిబ్బందికి షేర్లను కేటాయించారు. ఇప్పుడు కంపెనీ విలువ రాకెట్ వేగంతో దూసుకుపోవడంతో.. ఆ షేర్ల విలువ ఊహించని స్థాయికి పెరిగి వేలాది కుటుంబాల తలరాతలను మార్చేసింది.