హైదరాబాద్ లో రూ. రెండు కోట్ల చిట్ ఫండ్ మోసం... కాలనీ అధ్యక్షుడు అని నమ్మి చిట్టీలు కడితే...హైదరాబాద్ లో భారీ చిట్ ఫండ్ మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరుతో కాలనీవాసులను మోసం చేశాడు కాలనీ అధ్యక్షుడు. చిట్టీల పేరుతో రూ. రెండు కోట్లు మోసానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని మీర్ పేట్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ నారాయణపురం వైష్ణవి కాలనీలో చోటుచేసుకుంది ఈ ఘటన. వెంకట సాయి చిట్ ఫండ్స్ పేరుతో వైష్ణవి కాలనీ అధ్యక్షుడు సురేష్ కుమార్, అతని భార్య గత పదేళ్లుగా చిట్టీలు నిర్వహిస్తూ, ప్రజల వద్ద నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని పేర్కొన్నారు బాధితులు.
సుమారు 25 మందికి పైగా బాధితులు రూ. రెండున్నర లక్షల నుండి రూ. పది లక్షల వరకు చిట్టీలలో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే చిట్టీ గడువు ముగిసిన తరువాత కూడా వారికి డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, చెక్కులు మరియు ప్రామిసరీ నోట్లు ఇచ్చి కాలయాపన చేస్తున్నారని తెలిపారు బాధితులు.డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే నిర్లక్ష్యంగా స్పందిస్తూ, “మేము ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకోండి” అంటూ సమాధానమిచ్చారని... మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధితులు.
ఇంకా మరికొందరు కూడా ఇదే విధంగా మోసపోయినట్లు కాలనీవాసులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
