NEET కేటుగాళ్ల కలకలం.. VPN వాడినా దొరికిపోయిన 19 ఏళ్ల విద్యార్థి..

NEET  కేటుగాళ్ల కలకలం.. VPN వాడినా దొరికిపోయిన 19 ఏళ్ల విద్యార్థి..

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ జరగడానికి కేవలం మూడు రోజుల ముందు రాజస్థాన్‌లో ఒక పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. టెలిగ్రామ్ యాప్ ద్వారా నకిలీ ప్రశ్నపత్రాలను అమ్ముతున్న 19 ఏళ్ల విద్యార్థిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

రాజస్థాన్‌లోని భిల్వారాకు చెందిన ఆకాష్ చౌదరి (19) అనే విద్యార్థి జైపూర్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇతను టెలిగ్రామ్‌లో 'పేపర్ మాఫియా' పేరుతో ఒక ఛానల్‌ను క్రియేట్ చేశాడు. అందులో నీట్ పరీక్షకు సంబంధించిన ప్రిపరేషన్ పుస్తకాలలోని పేజీలను స్కాన్ చేసి, అవే అసలైన లీకైన ప్రశ్నపత్రాలంటూ నచ్చించి.. ఒక్కో నకిలీ ప్రశ్నపత్రానికి అభ్యర్థుల నుండి రూ. 4,000 వసూలు చేశాడు. అది కూడా డబ్బులను క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా డిజిటల్ రూపంలో తీసుకున్నాడు. అంతేకాకూండా టెక్నాలజీ వాడుకుంటూ తన అసలు గుర్తింపు ఎవరికీ దొరకకుండా ఉండేందుకు అమెరికాకు చెందిన VPN అండ్ ప్రాక్సీ నెట్‌వర్క్‌లను ఉపయోగించాడు. ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో అప్పటికే సుమారు 52 మంది ఉన్నారు.

పోలీసులు ఎలా పట్టుకున్నారంటే 
సోషల్ మీడియాలో పేపర్ లీకులకు సంబంధించిన అనుమానాస్పద లింకులపై కేంద్ర ప్రభుత్వ 'ఎస్-మేక్' పోర్టల్ ద్వారా పోలీసుల స్పెషల్ బ్రాంచ్‌కు సమాచారం అందింది. అదే సమయంలో భిల్వారా జిల్లా ప్రత్యేక పోలీస్ బృందానికి (DST) కూడా నిఘా సమాచారం రావడంతో రంగంలోకి దిగారు. ఢిల్లీ నుంచి అందిన పక్కా సమాచారంతో, శుక్రవారం తెల్లవారుజామున భిల్వారాలోని పటేల్ నగర్‌లో ఉన్న నిందితుడి ఇంటిపై దాడి చేసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్, నీట్ స్టడీ మెటీరియల్, మరియు కొన్ని కీలక పేపర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

టెలిగ్రామ్‌పై ఆంక్షలు:
ఈ నీట్ పేపర్ లీక్ వివాదాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై నిఘా పెంచింది. జూన్ 21న జరిగే రీ-టెస్ట్ ముగిసే వరకు అంటే జూన్ 22 వరకు టెలిగ్రామ్ వాడకంపై కొన్ని ఆంక్షలు విధించారు. అంతేకాదు, యాప్‌లో మెసేజ్‌లను ఎడిట్ చేసే ఆప్షన్‌తో సహా కొన్ని ఫీచర్లను తాత్కాలికంగా నిలిపివేశారు.

కేసు నమోదు, దర్యాప్తు:
నిందితుడు ఆకాష్ చౌదరి కుటుంబం అసలు చురు జిల్లాకు చెందినదైనా, గత 25 ఏళ్లుగా భిల్వారాలోనే ఉంటున్నారు. ప్రస్తుతం పోలీసులు అతనిపై మోసం, ఫోర్జరీ, ఐటీ చట్టం,  పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ కింద కేసులు బుక్ చేశారు. ఇప్పటివరకు ఎంత మంది విద్యార్థులు ఇతని చేతిలో మోసపోయారు ? ఎంత డబ్బు వసూలు చేశాడు ? ఈ ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా ? అనే కోణంలో పోలీసులు బ్యాంక్ లావాదేవీలను, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు.