గండిపేట భూముల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో ఇటీవల అరెస్టైన ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. 15 రోజులకు ఒకసారి పీఎస్ కు హాజరు కావాలని, రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని బ్రహ్మనాయుడును ఆదేశించింది కోర్టు.
గండిపేటలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు నకిలీ పత్రాలు, నకిలీ ప్రభుత్వ జీవోలు సృష్టించిన కేసులో బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గండిపేట గ్రామంలోని సర్వే నంబర్ 18లో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కొందరు వ్యక్తులు కుట్ర పన్నారు. ఈ భూమిని కోర్టు తమకే కేటాయించినట్లు తప్పుడు రెవెన్యూ రికార్డులు సృష్టించి, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేశారు.
ALSO READ : ఉద్యోగులకు డబుల్ ధమాకా
ఆ భూమిని కొనుగోలు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, అతని సోదరుడు రమేష్లతో నిందితులు ఒప్పందం చేసుకున్నారు. దీనిపై గండిపేట తహసీల్దార్ ఎన్. శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత నెల 23న నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఈ కుట్రలో బ్రహ్మనాయుడు సహా ఇప్పటికే నిమ్మల రాజేశ్, వేణుగోపాల్, సాయి కిరణ్, రాధాకృష్ణ, ప్రవీణ్ కుమార్ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
