బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం విద్యపై వ్యతిరేకత చాలా ఉంది. అయితే, గత కొన్ని ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం ఉండాలనే ఒత్తిడి బాగా పెరిగాక ముందు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆ తరువాత తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. గవర్నమెంట్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశపెట్టారు. రెండు రాష్ట్రాల్లో కూడా విద్యార్థులు, టీచర్ల సౌకర్యార్థం ద్విభాషా పాఠ్యపుస్తకాలను కూడా అందిస్తున్నారు. అయితే, ఈ మధ్య కొంతమంది మేధావులు, రాజకీయ నాయకులు ఈ విధానాన్ని మార్పించి కనీసం 5వ తరగతి వరకైనా కేవలం తెలుగు మీడియం విధానాన్ని వెనక్కి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ విద్యా కమిషన్ ఎల్కేజీ నుంచి ఇంగ్లిష్, తెలుగును బోధిస్తూనే ఒకటో తరగతి నుంచి ఒక తెలుగు సబ్జెక్టుతో ఇంగ్లిష్ మీడియంను బలపర్చాలని దాదాపు 99 శాతం గ్రామీణ ప్రాంతపు తల్లిదండ్రుల అభిప్రాయమని తేల్చాక కూడా, మళ్లీ తెలుగు మీడియంకు మార్చాలని ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది. ప్రభుత్వ విద్యలో తెలుగు మీడియం విధానం అనివార్యం చేయాలనే ప్రయత్నంలో ప్రైవేటు స్కూలు యాజమాన్యాల ప్రభావం ఉందని అర్థమవుతూనే ఉంది. ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేస్తే ఎన్నికల రంగంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేకతను చవిచూడక తప్పదు.
సర్వే రిపోర్టులో వాస్తవాలు
తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన సర్వేలో ఏ కులం ఇంగ్లిష్ మీడియం విద్య అభ్యసించింది? వారి ఆర్థిక, ఉద్యోగ వనరులు ఎలా ఉన్నాయో ఒక పట్టిక ద్వారా ఎక్స్పర్ట్ కమిటీ బయటపెట్టింది. కమిటీ పట్టికలో దాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. అన్ని కులాల కంటే ఇంగ్లిష్ విద్యలో ముందున్న కులాలు బ్రాహ్మణ, కోమటి, కమ్మ, వెలమ, రాజు, రెడ్డి, బీసీ, క్రిస్టియన్లు, కాపు (ఓసీలు), గోల్డ్‌స్మిత్, జైనులు, దాదాపు 75 శాతానికి పైన ఇంగ్లిష్ మీడియం చదువుల్లో ఉన్నారు. వీరు ఎక్కువ అర్బన్ ప్రైవేటు స్కూళ్లలో చదివిన లేదా చదువుతున్నవారు. అయితే, రెడ్లలో గ్రామీణ వ్యవసాయ కుటుంబాలకు, పట్టణ ప్రాంతానికి చెందినవారిలో విద్యా వ్యత్యాసం ఉంటుంది. 17 లక్షలకుపైన జనాభా ఉన్న ఈ కులంలో మిగతా చిన్న కులాల్లోలాగ ఇంగ్లిష్ మీడియం విద్య చిక్కదనం ఉండదు. గ్రామాల్లో వ్యవసాయం చేసుకునే చాలామంది వాళ్ల పిల్లల్ని తెలుగులో చదివిస్తారు. కానీ, ద్విజ చిన్న కులాలు పూర్తిగా తమ పిల్లల్ని ప్రైవేటు ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తున్నారు.
ఇంగ్లిష్ విద్య వారికి ప్రాపర్టీ ఎలా అయ్యింది?
తెలంగాణలో ఇంగ్లిష్ విద్యలో పూర్తిగా వెనకబడి ఉన్న కులాలను చూద్దాం. అతి ఎక్కువగా వెనకబడినవారు ఎస్టీ కొల్లం, ఎస్టీ గోండ్, బీసీ–డీ మాలి, ఎస్టీ కోయ, ఎస్సీ బెడా, బీసీ–ఎ వాల్మీకి, మాదాసి (మాదాసి కురుబ), బీసీ–ఎ వడ్డె, ఎస్సీ మహర్, బీసీ–డీ ఆరెవాళ్లు, బీసీ–డీ ముదిరాజ్, ఎస్సీ మాదిగ, ఎస్టీ ఎరుకల, బీసీ–ఈ ఖురేషి ముస్లిం, బీసీ–బీ కురుమ.. ఇలా లిస్టు కొనసాగుతున్నది. అయితే, ఇంగ్లిష్ భాష
నేర్చుకోవడంలో వెనుకబడి ఉన్న ఈ కులాలకు ఇంతో అంతో భూమి లేదా అంటే ఉంది. కానీ, వీరి ఆర్థిక, సాంఘిక, జ్ఞాన అభివృద్ధి చాలా వెనకబడి ఉంది. వీరిలో తెలుగు మీడియం డిగ్రీలు, పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీలు పొందినవారు లేరా అంటే ఉన్నారు. కానీ, ఇప్పుడున్న హై ఎకానమీలో, నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్లో వీరికి ఎంట్రీ లేనే లేదు. బాగా ఇంగ్లిష్ విద్య నేర్చుకున్న కులాలు విద్యావ్యవస్థలో ఉన్నారు. వీరి ప్రస్తుత మాతృభాష తెలుగే. కానీ, వారి పిల్లలు ఎల్కేజీ నుంచి 12వ తరగతి వరకు, ఆ పై చదువులు ఇంగ్లిష్‌లోనే చదువుతున్నారు.
తెలంగాణలో ఇంగ్లిష్‌లో బాగా చదువుకున్న కులాలు ఒక్క రెడ్లు తప్ప సంఖ్యరీత్యా మిగతా అగ్రకులాలు చిన్నవి. కానీ, బీసీ, ఎస్సీ, కులాల సంఖ్య చాలా పెద్దది. వారు గ్రామీణ ప్రాంతంలో తప్ప చదువు నేర్చుకునే అవకాశం లేదు. గ్రామస్థాయి స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం అందుబాటులో లేకపోతే కోట్లాది గ్రామజీవులు బాగా ఇంగ్లిష్ నేర్చుకునే పట్టణ అభివృద్ధి చెందిన కులాల పిల్లలతో ఏ రంగంలోనూ పోటీపడలేరు. వ్యవసాయ రంగం నాలెడ్జి కూడా ఎక్కువ ఇంగ్లిషులోనే ఉంది. కనుక అదికూడా వారు తెలివిగా చేయలేరు. వ్యవసాయరంగ పనుల్లో కూడా ఆధునిక టెక్నాలజీతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రవేశిస్తుంది. ముందు ముందు ఉద్యోగం నిర్వచనం కూడా మారిపోతుంది.
అమెరికన్ మోడల్లో ప్రైవేటు రంగంలోనే ఎక్కువ ఉద్యోగాలు
ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో అమెరికా మోడల్‌ను అనుసరించి ప్రభుత్వరంగ ఉద్యోగాలను బాగా తగ్గించివేస్తుంది. అమెరికన్ మోడల్లో ప్రైవేటు రంగంలోనే చాలా ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి. అవి ఇంగ్లిష్ బాగా నేర్చుకుని పోటీలో తట్టుకున్నవారికే దక్కుతాయి. ఇప్పుడు తెలంగాణలో ఏడు అగ్ర కులాల పిల్లలే ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, డబ్బు చలామణి అయ్యే మార్కెట్లో ఉంటారు. కులగణనను అధ్యయనం చేసిన ఎక్స్పర్ట్ గ్రూపు అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ఇంగ్లిష్ విద్యలో ముందున్న 7 కులాలు
ఇంగ్లిష్ విద్యలో చాలా ముందడుగు వేసి ఉన్న ఏడు కులాలు 42 ప్యారామీటర్ల ప్రకారం రూపొందిన కాంప్రహెన్సివ్, బ్యాక్‌వర్డ్‌నెస్ ఇండెక్స్(సీబీఐ) స్కోరులో కూడా బాగా అభివృద్ధి చెంది ఉన్నారు. ఈ స్కోరులో ఓసీ రాజులది 17, వెలమలది 19, బ్రాహ్మణులది 22, బీసీ–సీ క్రిస్టియన్లది 23, కమ్మలది 19, రెడ్లది 28. ఇందులో రెడ్లు 17లక్షల పైగా జనాభా ఉన్న కులం. అయినా మిగతా అగ్రకులాలకన్నా రెడ్డి కులంలో అందరికీ ఇంగ్లీష్ విద్య అంది ఉండదు. కానీ, మొత్తం రాష్ట్ర భూమిలో 13శాతానికిపైగా రెడ్ల చేతిలో ఉన్నందువల్ల గ్రామస్థాయి భూస్వామ్య ఆధిపత్యం వారి చేతిల్లోనే ఉంది.
అందుకే రాజకీయాల్లో వాళ్లే అధికారం నడుపుతున్నారు. ఒకప్పుడు శూద్ర భూస్వామ్య కులమైన వెలమలు దాదాపు 95 శాతం పట్టణీకరించబడ్డ కులం. అందుకే వారు బాగా అభివృద్ధి చెందిన కులంగా ఎదిగారు. అందుకు తోడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్– బీఆర్ఎస్పరిపాలనలో చాలా వనరులు సంపాదించగలిగారు. దాదాపు 100 శాతం ఈ కులంవారి పిల్లలు ప్రైవేటు ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదువుకుంటున్నారు. ఈ స్థితిలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంను తగ్గించినా, తొలగించినా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలు ఈ కులాలతో వచ్చే వంద ఏండ్లలో కూడా పోటీపడలేరు.
ఇంగ్లిష్ మీడియంను వ్యతిరేకిస్తున్నదెవరు ?
గత 25–30 ఏండ్లుగా ప్రభుత్వ స్కూళ్లల్లో కూడా ఇంగ్లిష్ మీడియం ఉండాలనే డిమాండ్‌ను మాతృభాష రక్షణ పేరుతో వ్యతిరేకిస్తూ వచ్చింది చుక్కా రామయ్య, ఏబీకే ప్రసాద్, బుద్ధప్రసాద్ మొదలగువారు. వీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 6 వేల ఇంగ్లిష్ మీడియం సెక్షన్లు ప్రభుత్వ స్కూళ్లలో ప్రారంభించినప్పడు బలంగా వ్యతిరేకించారు. కానీ వైఎస్ఆర్ వారి వాదనను లెక్కచేయకుండా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం సెక్షన్లు ప్రారంభించారు. దానితో 6 వేల స్కూళ్లల్లో గ్రామీణ పిల్లలంతా ఇంగ్లిష్ మీడియంలోకి మారి తెలుగు మీడియం సెక్షన్లు క్రైసిస్‌లో పడ్డాయి. ఈ మేధావులు మరీ కంగారుపడిపోయి ప్రభుత్వం మీదకి టీచర్లను రెచ్చగొట్టారు.
అగ్రకుల మేధావులు తమ వాదనలను పబ్లిక్‌గా చర్చకు పెట్టాలి
వీరంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు ఏం కావాలని వారి ఇంగ్లిష్ మీడియం చదువును వ్యతిరేకిస్తున్నారు? తమతమ కులాల్లో పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో డబ్బులున్నాయి కనుక చదువుకుంటే తెలుగు భాషకు, సంస్కృతికి మేలు ఎలా జరుగుతుంది? ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు పైసలు లేవు కనుక ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే తెలుగు భాషకు, సంస్కృతికి, జాతీయవాదానికి ఎలా ప్రమాదం ఏర్పడుతుందో వారి వ్యాసాల్లో చదివితే తెలుసుకోవాలని నాకు కోరిక ఉంది.
తెలంగాణ కులగణన, సీబీఐ స్కోరు ద్వారా బయటకు వచ్చిన విద్యా వ్యత్యాసాలు లెక్కల్లో తేల్చి చెప్పిన తరువాత కూడా అగ్రకుల మేధావులు తమ వాదనలను పబ్లిక్ గా చర్చకు పెట్టకుండా ముఖ్యమంత్రులను, విద్యామంత్రులను, అధికారులను ఒప్పించి ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం తగ్గించినా, ఆపించినా అది అప్రజాస్వామికం, అన్యాయం అవుతుంది. వారి వాదనల కోసం వేచి చూద్దాం.
2019 ఎన్నికల్లో తన వాగ్దానం ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లిష్ మీడియం పూర్తిస్థాయిలో ప్రవేశపెడితే వెంకయ్యనాయుడు, జస్టిస్ ఎన్వి రమణ, జయప్రకాశ్ నారాయణ, తెలంగాణ నుంచి ప్రొ.హరగోపాల్వంటి వారు ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం ప్రమాదకరమని, మన భాష, సంస్కృతిలను ఇంగ్లిష్ చంపుతుందని ప్రచారానికి దిగారు.
ఇప్పుడు వీళ్లంతా తెలంగాణలో నడుస్తున్న ఇంగ్లిష్ మీడియంను క్లోజ్ చేయించాలని ముఖ్యమంత్రికి, విద్యా కమిటీకి సిఫారసులు చేస్తున్నారు. కానీ, వీరందరూ కమిటీ పట్టికలో చూపించినట్టు ఇంగ్లిష్ మీడియం చదువులు ప్రైవేటు స్కూళ్లల్లో బాగా చదువుకుంటున్న కులాలకు చెందినవారే.
ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
