ఒపెక్‌‌‌‌ నుంచి యూఏఈ వైదొలగడం భారత్కు లాభదాయకమేనా!

ఒపెక్‌‌‌‌  నుంచి యూఏఈ వైదొలగడం భారత్కు లాభదాయకమేనా!

ప్రపంచ మానవాళి యుద్ధ విపత్తు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్నది.  ఒకవైపు  ఉక్రెయిన్‌‌‌‌, -రష్యా యుద్ధం,  మరోవైపు  గాజాపై  ఇజ్రాయెల్‌‌‌‌ దాడులు కొన్ని ఏండ్లుగా విధ్వంసం చేస్తున్నాయి.  అమెరికా, ఇజ్రాయెల్‌‌‌‌–- ఇరాన్‌‌‌‌  యుద్ధం నేడు ప్రపంచాన్ని తీవ్ర చమురు సంక్షోభంలోకి నెట్టుతున్నది.  ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్‌‌‌‌ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నది. 

చమురు ఉత్పత్తి చేస్తున్న 12 ప్రధాన దేశాలు ఏర్పాటు చేసుకున్న  ‘ఒపెక్‌‌‌‌’ లేదా ‘ఓపిఈసి’ (ఆర్గనైజేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ది పెట్రోలియం ఎక్స్‌‌‌‌పోర్టింగ్‌‌‌‌ కంట్రీస్‌‌‌‌) కూటమి నుంచి తాము వైదొలుగుతున్నట్లు  యునైటెడ్‌‌‌‌ అరబ్‌‌‌‌ ఎమిరేట్స్‌‌‌‌ (యూఏఈ)  ప్రకటించడం ఓ సంచలన నిర్ణయమని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. ఈ కూటమి తమ సభ్య దేశాలకు ఎంత చమురు ఉత్పత్తి చేయాలనే  అంశాన్ని  నిర్ణయిస్తున్నది. 

  • ఒపెక్, ఒపెక్​ ప్లస్​

1960లో  ఏర్పాటు అయిన ఒపెక్‌‌‌‌ కూటమిలో 12 దేశాలు సభ్యులుగా ఉన్నాయి.  ప్రపంచ చమురు ఉత్పత్తిలో 35 శాతం  ఒపెక్‌‌‌‌ దేశాలు ఉత్పత్తి  చేస్తున్నాయి.  చమురు ధరలను  నిర్ణయించడం, వివిధ దేశాల చమురు ఉత్పత్తిని నియంత్రించడం విధులను ఈ కూటమి నిర్వహిస్తున్నది. 

‘సెవెన్‌‌‌‌ సిస్టర్స్‌‌‌‌’గా  పిలిచే ఏడు పాశ్చాత్య కంపెనీలు శాసిస్తున్న చమురు మార్కెట్‌‌‌‌ సరఫరాను నిరోధించి తమ ప్రయోజనాలను కాపాడుకునే లక్ష్యంతో ఒపెక్‌‌‌‌ కూటమి ఏర్పడింది. 2016లో  ఈ  కూటమికి అదనంగా మరో 10 దేశాలు చేరడంతో ఒపెక్‌‌‌‌ ప్లస్‌‌‌‌ కూటమి ఏర్పడింది.  ప్రపంచంలో అతి పెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాల్లో వెనెజువెలా (303 బిలియన్‌‌‌‌ బ్యారెల్స్‌‌‌‌),  సౌదీ (267), ఇరాన్‌‌‌‌ (209), ఇరాక్‌‌‌‌(145),  యూఏఈ (113), కువైట్‌‌‌‌ (102), రష్యా(80), లిబియా(49), అమెరికా(45), నైజీరియా(37), చైనా(28), ఖతార్‌‌‌‌(25), బ్రెజిల్‌‌‌‌(16 బిలియన్‌‌‌‌ బ్యారెల్స్‌‌‌‌) ముందువరుసలో ఉన్నాయి. 

  • చమురు సరఫరా వ్యవస్థపై  ప్రభావం

అరేబియా సముద్రంతో  గల్ఫ్‌‌‌‌ను ఈ జల సంధి అనుసంధానం చేస్తున్నది.  ప్రపంచ చమురు వాణిజ్యంలో 25 శాతం చమురు, 20% ఎల్ఎన్‌‌‌‌జీ ఎగుమతులు  హార్మూజ్‌‌‌‌  జలసంధి గుండానే జరుగుతున్నది. 28 ఫిబ్రవరి 2026న  ప్రారంభమైన అమెరికా, ఇజ్రాయిల్‌‌‌‌–- ఇరాన్‌‌‌‌ యుద్ధంతో  హార్మూజ్‌‌‌‌  జలసంధి మూసివేయడంతో  ప్రపంచ దేశాలు ఇంధన సంక్షోభంలో  కొట్టుమిట్టాడుతున్నాయి. 2016లో  ఏర్పడిన ఒపెక్‌‌‌‌ ప్లస్‌‌‌‌ కూటమి నుంచి నేడు యూఏఈ  వైదొలగడం అనే నిర్ణయం ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై  తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చని అంచనా వేస్తున్నారు.  తమ జాతీయ  ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గల్ఫ్‌‌‌‌, అత్యంత ఇరుకైన హార్మూజ్‌‌‌‌  జల సంధిలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ  ప్రకటించింది.   

ప్రపంచ చమురు అవసరాలను తీర్చడంతోపాటు బాధ్యతాయుతమైన, నమ్మకమైన ఉత్పత్తిదారుగా తన పాత్రకు కట్టుబడి ఉండాలనే  సానుకూల లక్ష్యంతో ఈ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ  తెలిపింది.  ఈ నిర్ణయంతో  ఒపెక్‌‌‌‌పై  సౌదీ  అనధికారిక నాయకత్వానికి ఎదురు దెబ్బపడినట్లు అని,  చమురు ధరలు కొంత తగ్గవచ్చని కూడా భావిస్తున్నారు.  ఇంతకుముందు చమురు కూటమి నుంచి వైదొలగిన దేశాలుగా ఖతార్‌‌‌‌,  ఇండోనేషియా, ఈక్వెడార్‌‌‌‌, అంగోలా, గబాన్‌‌‌‌లు ఉండడం గమనార్హం.  ఒపెక్‌‌‌‌లో నాలుగో  అతి పెద్ద చమురు ఉత్పత్తిదారుగా యూఏఈ రోజుకు 29.2 లక్షల బ్యారెల్స్‌‌‌‌ చమురును ఉత్పత్తి చేస్తున్నది. 

  • యూఏఈ  నిర్ణయంతో లాభమా, నష్టమా?

భారతదేశం చమురు అవసరాల్లో 91శాతం  దిగుమతులపై  మాత్రమే ఆధారపడి ఉన్నది.  వీటిలో 54 శాతం మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి అవుతున్నది.  యూఏఈ  భారత్‌‌‌‌కు బలమైన వ్యూహాత్మక భాగస్వామిగా అనాదిగా నిలుస్తున్నది.  ఈ నిర్ణయం వల్ల యూఏఈ  సమీప భవిష్యత్తులో అదనంగా 5 -– 6 మిలియన్‌‌‌‌ బ్యారెల్స్‌‌‌‌ చమురు ఉత్పత్తి  చేయవచ్చు. ఈ నిర్ణయం భారత్‌‌‌‌కు సానుకూలంగా మారుతుందని అంచనా. ఇప్పటికే  యూఏఈ నుంచి అధిక మొత్తంలో  చమురు కొంటున్న భారత్‌‌‌‌,  రాబోయే రోజుల్లో  అదనంగా పెద్ద మొత్తంలో  చమురును  దిగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నాయనే వ్యాఖ్యలు వింటున్నాం.  

యూఏఈ తన చమురు ఉత్పత్తిని పెంచితే, అదనపు చమురును  భారత్‌‌‌‌  దిగుమతి చేసుకునే అవకాశాలు పెరిగినట్లు స్పష్టం అవుతున్నది.  పెరుగుతున్న చమురు డిమాండ్‌‌‌‌ వల్ల తమ దేశానికి అదనపు ప్రయోజనాలు కలుగుతాయని కూడా యూఏఈ  భావిస్తున్నట్లు  తెలుస్తున్నది. యూఏఈ  తీసుకున్న  సంచలనాత్మక  నిర్ణయంతో  భారత్‌‌‌‌కు  స్వల్ప, మధ్యకాలిక  ఉపశమనం  కలుగవచ్చని  తెలుస్తున్నది. ఒపెక్‌‌‌‌ నుంచి తప్పుకోవాలనే యూఏఈ  నిర్ణయం వల్ల  ఒపెక్‌‌‌‌ దేశాల ఐక్యత, చమురు ఉత్పత్తికి పెద్ద దెబ్బగా నిలువనున్నట్లు తెలుస్తున్నది. 

- డా. బుర్ర 
మధుసూదన్ రెడ్డి