ఉద్యోగులు, పెన్షనర్లు నగదు రహిత వైద్యం కోసం 2023 నుంచి నిరీక్షించాల్సిన పరిస్థితి. ప్రతిసారి చర్చలు జరపడం, ఇస్తామనడం తప్ప గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు ఎలాంటి పురోగతి లేదు. హెల్త్‌కార్డులపై మాత్రం నిమ్స్, గాంధీ, ఉస్మానియాలో తప్ప ఎక్కడా ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించడం లేదు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ.హెచ్.ఎస్. స్కీమ్ అమలుకు గత కేసీఆర్ ప్రభుత్వం జీవో 186 జారీ చేసింది. అంతలోనే ప్రభుత్వం మారింది.
కాంగ్రెస్ సర్కార్ మార్గదర్శకాల జీవో ఇచ్చి ఉద్యోగులు సర్కార్ వాటాను ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ లో జమ చేయడం, హెల్త్‌కార్డులు ఇచ్చి వైద్యం అందించడం మాత్రమే మిగిలింది. 25 మే నెల, సెప్టెంబర్ 1న ఉద్యోగ పెన్షనర్ల జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వారంలో హెల్త్‌కార్డుల విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పింది. సరిగ్గా వారం గడిచాక ఈ పథకంపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. తీరా కొత్త కథను తెరపైకి తెచ్చారు.
ఈ.హెచ్.ఎస్. స్కీమ్‌పై ఇతర రాష్ర్టాల్లో అధ్యయనం చేసి నివేదిక తెప్పించుకుంటామన్నారు. ఆ తర్వాత మంత్రుల సబ్ కమిటీ చర్చల్లోనూ హెల్త్‌కార్డులిస్తామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెల్త్‌కార్డులకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. మే రెండో తేదీన స్వయంగా ముఖ్యమంత్రి ఉద్యోగ జేఏసీతో చర్చలు జరిపి నగదు రహిత వైద్యాన్ని జూన్ 1 నుంచి అమలు చేస్తామని హామీ ఇచ్చి జూన్ 2 నుంచి హెల్త్‌కార్డులిస్తామని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ జేఏసీతో చర్చలు జరిపారు.
ఇదే అంశంపై జూన్ 1న సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. చివరికి జూన్ 2 నుంచి అమలు చేస్తానన్న గడువు కూడా ముగిసింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జూన్ రెండు కూడా పూర్తి అయింది. ఇంతవరకు కార్డులు మాత్రం రాలేదు. నగదు రహిత కార్డులకు సంబంధించి విధివిధానాలు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఖరారు చేయలేదు. కానీ మే నెల ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పెన్షన్ నుంచి 1.5 శాతం కాంట్రిబ్యూషన్ హెల్త్‌కార్డుల కోసం ఉద్యోగ, పెన్షనర్ల అనుమతి లేకుండా అమౌంట్ కట్ చేశారు. ఈ విధంగా ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కట్ చేసిన మొత్తం అమౌంట్ రూ.528 కోట్లు అవుతుంది. ప్రభుత్వం కూడా అంతే అమౌంట్ అనగా రూ.528 కోట్లు ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ కు సంబంధించిన అకౌంట్‌లో జమ చేయాలి. కానీ ఆ విధంగా జరగలేదు. పెన్షనర్ల నుంచి కట్ చేసిన అమౌంట్ పే స్లిప్‌లో లేదు.
ఆరుగురు పెన్షనర్లను ట్రస్ట్ లో నియమించాలి
ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్టులో పెన్షనర్ల నుంచి ఆరుగురు ట్రస్టీలను నియమించాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి(జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ స్కీమ్‌లో చేరాలా? వద్దా? అనే ఆప్షన్ కూడా ఇవ్వాలని, బలవంతంగా చేర్చరాదని పెన్షనర్ల జేఏసీ చైర్మన్ కే. లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ, ఎ. రాజేంద్రబాబు తదితరులు సీఎస్ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం కూడా సమర్పించారు. సంవత్సరానికి రెండుసార్లు ఔట్ పేషెంట్ ట్రీట్మెంట్కు అవకాశం కల్పించాలని, అవసరమైన మందులు ఇవ్వాలని, వైద్య పరీక్షలు కల్పించాలని, అవుట్ పేషెంట్లకు కూడా వైద్యానికి అవకాశం
కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
రెండ్రోజుల్లో ట్రస్టు ఏర్పాటు చేస్తామని చెప్పినా, పది రోజులలో ఈ.హెచ్.ఎస్. కార్డులు అమలు పరుస్తామని అధికారులు చెప్పినా, ఆఖరికి గడువు ముగిసినా ట్రస్టు ఏర్పాటుకాలేదు. ఆస్పత్రులలో హెల్త్‌కార్డులు నెల ప్రీమియం చెల్లించినా అమలు అవడం లేదు. నిజామాబాద్ జిల్లాలో మెడిక్యూర్ హాస్పిటల్లో.. డీఈఓ ఆఫీసులో రిటైర్డ్ సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి అత్యవసర పరిస్థితుల్లో ఆదివారం జూన్ 7వ తేదీ హాస్పిటల్లో చేర్పిస్తే హెల్త్‌కార్డు చెల్లడం లేదని వేలాది రూపాయలు వసూలు చేశారు. ఇలాంటి ఎన్నో కేసులు లక్షల్లో డబ్బులు చెల్లించలేని స్థితిలో ఉద్యోగులు, పెన్షనర్లు బాధపడుతున్న విషయం గమనార్హం. ప్రభుత్వం తక్షణమే ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్యంపై శ్రద్ధ చూపి ఈ నెలలోనే ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలి.
- కందుకూరి దేవదాసు,
ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
