రెవెన్యూలో 70 మంది డీటీలకు తహశీల్దార్లుగా పదోన్నతి

రెవెన్యూలో 70 మంది డీటీలకు తహశీల్దార్లుగా పదోన్నతి

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ రెవెన్యూ శాఖలో సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 70 మంది నాయబ్ తహశీల్దార్లకు (డీటీలు) తహశీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ), తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ (టీజీఆర్ఎస్ఏ) నిరంతర కృషి ఫలితంగా ఈ పదోన్నతులు లభించాయి. 

మల్టీజోన్-1 పరిధిలో 43 మంది, మల్టీజోన్-2 పరిధిలో27 మంది నాయబ్ తహశీల్దార్లకు పదోన్నతి లభించింది. ప్రమోషన్లపై టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర నాయకులు ఎస్. రాములు, రమేశ్ పాక, బాణాల రాంరెడ్డి, వి. భిక్షం హర్షం వ్యక్తం చేశారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, సీసీఎల్ఏ లోకేశ్ కుమార్‌‌‌‌కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రక్రియలో రెవెన్యూ జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి పోషించిన పాత్ర మరువలేనిదని కొనియాడారు.