- మరో 900 కిలోల కోవా, వైట్ క్రీమ్, నెయ్యి కూడా పట్టివేత
- క్వాలిటీ పన్నీర్ అంటూ హైదరాబాద్లో హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా
- ఆరుగురు అరెస్ట్.. టెస్టుల కోసం ల్యాబ్‌కు శాంపిల్స్
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ లో పలువురు వ్యాపారుల నుంచి భారీ ఎత్తున కల్తీ పన్నీర్, కోవా, వైట్ క్రీమ్, నెయ్యిని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ తోపాటు ఇతర జిల్లాలకూ ఈ కల్తీ సరుకులను అమ్ముతున్నట్టు గుర్తించారు. బుధవారం సికింద్రాబాద్పరిధిలో దాడులు నిర్వహించిన ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్, మహంకాళీ పోలీసులు మొత్తం 3 వేల కిలోల కల్తీ పన్నీర్ పట్టుకున్నారు.
జనరల్ బజార్‌లోని శంకర్లాల్మిల్క్ అండ్ కర్డ్ ప్రొడక్ట్స్, విజయ మిల్క్ అండ్ కర్డ్ షాప్, వైభవ్ మిల్క్ డైరీ, శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్, జగదాంబ మిల్క్ అండ్ కర్డ్ మర్చంట్, తులసి గిరిరాజ్ డైరీ ప్రొడక్ట్స్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. శ్రీ బాలాజీ డైరీ ప్రొడక్ట్స్ లో 1,600 కిలోలు, విజయ్ మిల్క్ అండ్ కర్డ్ షాప్ లో1,000 కిలోలు, జగదాంబ మిల్క్ అండ్ కర్డ్ మర్చంట్ లో 300 కిలోల కల్తీ పన్నీర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
గ్రేటర్‌తో పాటు ఇతర జిల్లాలకు..
కల్తీ పన్నీర్ అమ్ముతున్న వ్యాపారులు చాలా కాలంగా గ్రేటర్జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లోని రిటైల్, హోల్‌సేల్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఈ పన్నీర్‌ను చాలా హోటల్స్, రెస్టారెంట్లు తమ కస్టమర్లకు పెడుతున్నాయి. పైగా తమ వినియోగదారులకు నాణ్యమైన పన్నీర్ అంటూ కిలో రూ.280కు అమ్ముతున్నారు. బహిరంగంగా ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేస్తున్నారు. దుమ్ము, ఈగలు చేరుతున్నాయని, ప్యాకెట్లపై తయారీ తేదీ, గడువు తేదీ, బ్రాండ్ వివరాలు కూడా లేవని పోలీసులు, అధికారులు వెల్లడించారు.
ఈ పన్నీర్ వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. తనిఖీల్లో మొత్తంగా 3,892 కిలోల కల్తీ డైరీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. పన్నీరుతో పాటు కోవా, వైట్ క్రీమ్, నెయ్యి కూడా కల్తీ అయ్యాయన్నారు. ఫుడ్ కల్తీకి పాల్పడిన ఆరుగురిని అరెస్ట్చేశామని, ఫుడ్ శాంపిల్స్ ను టెస్టుల కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులు ల్యాబ్ కు పంపించారని చెప్పారు.
