- నీట్ పీజీ-2025 కౌన్సెలింగ్ ముగిసినా భర్తీ కాని సీట్లు
హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించి నీట్ పీజీ-–2025 అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని రౌండ్ల కౌన్సెలింగ్‌తో పాటు స్ట్రే వేకెన్సీ రౌండ్ పూర్తయిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా మొత్తం1,140 సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ రాజ్యసభలో వెల్లడించారు. పీజీ సీట్లు ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కౌన్సెలింగ్ అర్హత మార్కులను భారీగా తగ్గించింది.
జనరల్ (యూఆర్) కేటగిరీ అభ్యర్థుల అర్హతను 7 పర్సంటైల్‌కు, జనరల్ పీడబ్య్లూడీ అభ్యర్థులకు 5 పర్సంటైల్‌కు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల అభ్యర్థులందరిని అర్హులుగా ప్రకటించారు. ఇంతలా వెసులుబాటు కల్పించినా, ప్రైవేట్ కాలేజీల్లో అధిక ఫీజులు, క్లినికల్ కోర్సుల్లో ఆసక్తి లేకపోవడం వంటి కారణాల వల్ల 1,140 సీట్లు భర్తీ కాలేదని తెలుస్తోంది. నీట్ పరీక్ష వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందని, దానిని రద్దు చేసే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. ప్రస్తుతానికి నీట్ పరీక్షను రద్దు చేసే ప్రణాళికలేవీ లేవని, ఇది దేశవ్యాప్తంగా ఏకరీతి విద్యా ప్రమాణాలను నిర్ధారిస్తుందని కేంద్రం రాజ్యసభలో స్పష్టం చేసింది.
