లివ్-ఇన్ రిలేషన్స్‌పై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. యువకుడికి విముక్తి

లివ్-ఇన్ రిలేషన్స్‌పై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.. యువకుడికి విముక్తి

అలహాబాద్ హైకోర్టు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లపై చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. భారతీయ యువతలో పెరుగుతున్న ఈ ధోరణి.. దానివల్ల తలెత్తుతున్న న్యాయపరమైన చిక్కులపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

యువతలో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌ల పట్ల ఆసక్తి పెరగడానికి వెస్ట్రన్ ఆలోచనలే ప్రధాన కారణమని జస్టిస్ సిద్ధార్థ్, జస్టిస్ ప్రశాంత్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ తరహా రిలేషన్‌షిప్ బ్రేక్ అయినప్పుడు.. మహిళలు తమ భాగస్వాములపై అత్యాచార ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రస్తుతం ట్రెండ్ గా మారుతోందని కోర్టు అభిప్రాయపడింది.

ప్రస్తుత చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉన్నాయని.. అయితే ఇవి లివ్-ఇన్ రిలేషన్‌షిప్ అనే భావన అసలు ఉనికిలో లేని కాలంలో రూపొందించబడ్డాయని కోర్టు గుర్తు చేసింది. సామాజిక మార్పులను పరిగణనలోకి తీసుకోకుండా.. పాత రూల్స్, చట్టాల ఆధారంగా పురుషులను దోషులుగా నిర్ధారించడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పరస్పర అంగీకారంతో కూడిన సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, వాటిని అత్యాచారంగా చిత్రీకరించడం పెరిగిపోతోందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

చంద్రేష్ అనే వ్యక్తి ఒక యువతిని కిడ్నాప్ చేసి, పెళ్లి పేరుతో మోసం చేసి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ట్రయల్ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. నిందితుడు ఆ యువతిని బెంగళూరుకు తీసుకెళ్లి ఆరు నెలల పాటు కలిసి ఉన్నాడని ప్రాసిక్యూషన్ వాదించింది. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా.. అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు మైనర్ అని ట్రయల్ కోర్టు భావించింది. కానీ అసిఫికేషన్ టెస్ట్ ప్రకారం ఆమె వయస్సు సుమారు 20 ఏళ్లు అని.. అంటే ఘటన సమయంలో ఆమె మేజర్ అని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసులో యువతి నిందితుడితో కలిసి బస్సుల్లో, రైళ్లలో కలిసి తిరిగినప్పుడు ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని కోర్టు గుర్తించింది. బెంగళూరు వంటి రద్దీ ప్రాంతంలో ఆరు నెలల పాటు కలిసి ఉన్నారని.. అది పూర్తిగా ఆమె ఇష్టపూర్వకంగా జరిగిన ప్రయాణమని అలహాబాద్ హైకోర్ట్ పేర్కొంది. ఎఫ్ఐఆర్‌లో ఒక వయస్సు, కోర్టులో మరో వయస్సు చెప్పడం కేవలం న్యాయ సలహా మేరకే జరిగిందని కోర్టు తప్పుబట్టింది.

దీంతో బాధితురాలు మేజర్ అని.. ఆమె తన ఇష్టపూర్వకంగానే నిందితుడితో వెళ్లినందున కిడ్నాప్, అత్యాచారం అనే ఆరోపణలు చెల్లవని హైకోర్టు తేల్చి చెప్పింది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్ ఫెయిల్ అయిన ప్రతిసారీ దాన్ని అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ.. చంద్రేష్‌కు విధించిన శిక్షను రద్దు చేసి అతడిని విడుదల చేయాలని కోర్ట్ తీర్పు వెలువరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.