భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!..అధికారికంగా స్పందించని ఇరాన్..క్లారిటీ ఇవ్వని కేంద్ర ప్రభుత్వం

భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!..అధికారికంగా స్పందించని ఇరాన్..క్లారిటీ ఇవ్వని కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో కల్లోలంగా మారిన హార్మూజ్ జలసంధిని భారత్ కోసం ఇరాన్ తెరిచిందని, రెండు భారత నౌకలు ఈ జలసంధిని క్షేమంగా దాటాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల సమాచారం. భారత ఇంధన అవసరాలకు కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా మన నౌకల రాకపోకలు ప్రారంభం కావడం పెద్ద ఊరటనిస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీల మధ్య గత కొద్ది రోజులుగా మూడుసార్లు కీలక చర్చలు జరిగాయి. 

షిప్పింగ్ భద్రత మరియు భారత ఇంధన అవసరాల గురించి ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావించారు. ఈ చర్చల తర్వాత భారత జెండా కలిగిన నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇటు భారత ప్రభుత్వం కానీ అటు ఇరాన్ కానీ అధికారికంగా స్పందించలేదు. పరిస్థితి ఇంకా సున్నితంగానే ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. 

కాగా, ప్రస్తుతం హార్మూజ్ జలసంధి ప్రాంతంలో మన దేశానికి చెందిన సుమారు 28 నౌకలు, వాటిలో 778 మంది భారతీయ నావికులు ఉన్నారు. వీరి భద్రతను పర్యవేక్షించేందుకు భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖ, రాయబార కార్యాలయాలు మరియు షిప్పింగ్ సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.