సీఈసీ తొలగింపు కోసం193 మంది ప్రతిపక్ష ఎంపీల సంతకం

సీఈసీ తొలగింపు కోసం193 మంది ప్రతిపక్ష ఎంపీల సంతకం
  • నేడు ఏదైనా సభలో నోటీసు

న్యూఢిల్లీ: చీఫ్  ఎలక్షన్  కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్  కుమార్ ను తొలగించాలని కోరుతూ 193 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. సంతకం పెట్టిన వారిలో లోక్ సభ నుంచి 130, రాజ్యసభ నుంచి 63 మంది ఉన్నారు. ఇండియా బ్లాక్ లోని అన్ని పార్టీల ఎంపీలు ఇదివరకే ఆ నోటీసుపై సంతకాలు చేశారు. ఈ కూటమిలో భాగంకాని ఆమ్  ఆద్మీ పార్టీ ఎంపీలు కూడా సంతకాలు పెట్టారని ప్రతిపక్ష నేత ఒకరు వెల్లడించారు.

శుక్రవారం లోక్ సభ లేదా రాజ్యసభలో సంతకాల నోటీసును సమర్పించనున్నామని ఆ ఎంపీ తెలిపారు. నోటీసుపై సంతకం చేయడానికి ఎంపీలు చాలా  ఉత్సాహం చూపారని, గురువారం కూడా పలువురు ఎంపీలు సంతకం చేశారని చెప్పారు. ఇప్పటికే అవసరమైన ఎంపీల సంతకాలు సేకరించామని వెల్లడించారు. కాగా.. సీఈసీని తొలగించాలంటే లోక్ సభలో కనీసం 100 వంది, రాజ్యసభలో 50 మంది సంతకాలు చేయాలి. సీఈసీని తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు సంతకాల సేకరణ చేయడం ఇదే మొదటిసారి.